ఎర్త్ సైన్సెస్ యూనివర్శిటీ ఏర్పాటుకు .. వడివడిగా అడుగులు

ఎర్త్ సైన్సెస్ యూనివర్శిటీ ఏర్పాటుకు .. వడివడిగా అడుగులు
  • వర్సిటీకి మాజీ ప్రధాని మన్మోహన్​ సింగ్ పేరు 
  •  మైనింగ్​ కాలేజీని అప్​గ్రేడ్​ చేస్తూ జీవో జారీ
  •  వచ్చే నెల ప్రారంభించనున్న సీఎం రేవంత్​రెడ్డి 

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : దేశంలోనే మొట్టమొదటి ఎర్త్​ సైన్సెస్​ యూనివర్శిటీ భద్రాద్రికొత్తగూడెం జిల్లా పాల్వంచలో ఏర్పాటుకు సర్కారు వేగంగా చర్యలు తీసుకుంటుంది. కాకతీయ యూనివర్సిటీ కింద కొత్తగూడెంలో మైనింగ్ ఇంజనీరింగ్​కాలేజీ కొనసాగుతోంది. ఈ కాలేజీనే ఎర్త్​ సైన్సెస్ యూనివర్సిటీగా అప్​ గ్రేడ్​చేస్తూ ప్రభుత్వం జీఓ ​నంబర్​ 20 జారీ చేసింది. దీనికి మన్మోహన్​ సింగ్​ ఎర్త్​ సైన్సెస్​ యూనివర్శిటీ గా నామకరణం చేశారు. వైస్​ ఛాన్స్​లర్​గా ఉన్నత విద్యాశాఖ ప్రిన్సిపల్​సెక్రటరీ యోగితారాణాకు బాధ్యతలు అప్పగించారు. ఆగస్టులో యూనివర్సిటీని సీఎం రేవంత్​ రెడ్డి ప్రారంభించనుండగా.. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, అధికారులు ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నారు. 

దేశంలోనే మొట్ట మొదటి ఎర్త్​ సైన్సెస్​ యూనివర్శిటీ 

సింగరేణి గనులకు పుట్టినిల్లయిన భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో 1956లో కొత్తగూడెం స్కూల్​ ఆఫ్​​ మైన్స్ ను ఉస్మానియా యూనివర్సిటీ ఆధీనంలో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 1976లో సింగరేణి కాలరీస్​కంపెనీ సహకారంతో పీజీ కోర్సును ప్రారంభించారు . 1994లో ఈ కాలేజీ కాకతీయ యూనివర్శిటీ పరిధిలోకి వెళ్లింది. కొత్తగూడెం, పాల్వంచ సరిహద్దులోని ఈ కాలేజీలోనే ఏర్పాటవుతున్న ఎర్త్​ సైన్సెస్​ యూనివర్శిటీ నిర్వహణకు జిల్లా అనుకూలంగా ఉంటుంది. జిల్లాలో అపారమైన ఖనిజాలున్నాయి. 

నేషనల్​ హైవేకి దగ్గరలో దాదాపు 300 ఎకరాల్లో యూనివర్శిటీ ఏర్పాటు కానుంది. ఇక్కడికి దగ్గరలోనే కేటీపీఎస్​, ఫెర్రో ఎల్లాయిస్​, నవభారత్​, ఫెర్రో మెగ్నీషియం, సింగరేణి మైన్స్​ఉన్నాయి. సారపాకలో ఐటీసీ పేపర్​ బోర్డు, మణుగూరులో హెవీ వాటర్​ ప్లాంట్​, బీటీపీఎస్​ ఉన్నాయి. కొత్తగూడెం వరకు రైలు మార్గం ఉంది. యూనివర్శిటీ కాలేజీలో ప్రస్తుతం బీటెక్​లో మొదటి దశ అడ్మిషన్లు జరిగాయి. ఇక్కడ సీఎస్​సీ, ఐటీ, ఈఈఈ, ఈసీఈ, మైనింగ్ బ్రాంచీలుండగా.. ఒక్కో దాంట్లో 60 సీట్లు కేటాయించారు. మొత్తం 300 సీట్లకు గానూ ఇప్పటివరకు 160సీట్లు భర్తీ అయ్యాయి. 

అందుబాటులోకి రానున్న కోర్సులు 

ఎర్త్​ సైన్సెస్​ యూనివర్శిటీ ఏర్పాటుతో ప్రస్తుతం ఉన్న ఇంజనీరింగ్​ కోర్సులతో పాటు అదనంగా నాలుగు యూజీ, నాలుగు పీజీ కోర్సులు అందుబాటులోకి రానున్నాయి. జియాలజీ, ఎన్విరాన్​మెంటల్​ సైన్సెస్​, జియో ఫిజిక్స్​, జియో కెమిస్ట్రీ కోర్సుల్లో మొదటి దశ అడ్మిషన్లు చేపట్టేందుకు ఆఫీసర్లు కసరత్తు చేస్తున్నారు. దోస్త్​ ఫైనల్​ ఫేజ్​కింద యూజీ కోర్సుల అడ్మిషన్లు ఇవ్వాలని ప్లాన్​ చేస్తున్నారు. భవిష్యత్తులో జియో కెమిస్ట్రీ, జియో ఫిజిక్స్​, ప్లానెట్రీ జియాలజీ, స్ట్రక్చర్​ జియాలజీ, మినరల్స్​​తదితర కోర్సులు అందుబాటులోకి రానున్నాయి. 

ఏర్పాట్లను పరిశీలించనున్న తుమ్మల 

అగ్రికల్చర్​ మినిష్టర్​ తుమ్మల నాగేశ్వరరావు ఇంచార్జి వీసీ యోగితారాణా , ఉన్నత విద్యాశాఖ కమిషనర్​ దేవసేన, ఇతర అధికారులతో కలిసి బుధవారం ఇక్కడికి రానున్నారు. యూనివర్శిటీకి అవసరమైన మౌలిక సదుపాయాలు, ఫ్యాకల్టీ, బిల్డింగ్స్​, ల్యాబ్స్​తదితర సౌకర్యాలను పరిశీలించనున్నారు. అవసరమైన ప్రతిపాదనలు రూపొందించనున్నారు. ఈ యూనివర్సిటీ రాష్ట్రంతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన యువ సైంటిస్ట్​లకు ఎంతో ఉపయోగకరంగా ఉండనుందని తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు.