UPSC : యూపీఎస్సీ నూతన ఛైర్మన్‌గా డా.మనోజ్‌ సోనీ ప్రమాణస్వీకారం

UPSC : యూపీఎస్సీ నూతన ఛైర్మన్‌గా డా.మనోజ్‌ సోనీ ప్రమాణస్వీకారం

ఢిల్లీ : యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(UPSC) ఛైర్మన్‌గా ప్రముఖ విద్యావేత్త మనోజ్‌ సోనీ మంగళవారం (మే 16వ తేదీన) ప్రమాణస్వీకారం చేశారు. 2017 జూన్ 28వ తేదీన క‌మిష‌న్‌లో సభ్యుడిగా చేరిన ఆయన.. గతేడాది ఏప్రిల్‌ 5 నుంచే యూపీఎస్సీ ఛైర్మన్‌ హోదాలో పని చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం యూపీఎస్సీలో సీనియ‌ర్ స‌భ్యురాలైన స్మితా నాగ‌రాజ్ మనోజ్ సోనీతో ప్రమాణస్వీకారం చేయించారు. ఇదే విషయాన్ని ఉన్నతాధికారులు వెల్లడించారు. యూపీఎస్సీలో సభ్యుడు కావడానికి ముందు మనోజ్‌ సోనీ మూడుసార్లు పలు యూనివర్సిటీల్లో వీసీగా పని చేశారు.  

2009 ఆగస్టు 1 నుంచి 2015 జులై 31 వరకు మనోజ్‌ సోనీ గుజరాత్‌లోని డా. బాబాసాహెబ్‌ అంంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీలో వరుసగా రెండు సార్లు వీసీగా సేవలందించారు. అంతకుముందు బరోడాలోని మహారాజా సాయాజిరావు యూనివర్సిటీలో ఏప్రిల్‌ 2005 నుంచి 2008 ఏప్రిల్‌ వరకు వీసీగా పని చేశారు. ఇంటర్నేషనల్‌ రిలేషన్స్‌లో స్పెషలైజేషన్‌తో పొలిటికల్‌ సైన్స్‌లో స్కాలర్‌ అయిన సోనీ.. వీసీగా ఉన్న కాలం మినహా 1991 నుంచి 2016 వరకు గుజరాత్‌లోని ఆనంద్‌ జిల్లాలో వల్లభ్‌ విద్యానగర్‌లోని సర్దార్ పటేల్ యూనివర్శిటీలో ఇంటర్నేషనల్‌ రిలేషన్స్‌ అంశాన్ని బోధించేవారు. 

మహారాజా సాయాజీరావు వర్సిటీలో వీసీగా చేరినప్పుడు ఆయన అత్యంత పిన్న వయస్కుడైన వీసీగా రికార్డు నమోదు చేసుకున్నారు. అఖిలభారత సర్వీసులైన ఐఏఎస్‌, ఐఎఫ్ఎస్‌, ఐపీఎస్‌ ఉద్యోగులను ఎంపిక చేసేందుకు యూపీఎస్సీ ఏటా సివిల్స్‌ సర్వీసెస్‌ పరీక్ష నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. యూపీఎస్సీలో ఛైర్మన్‌తో పాటు గరిష్ఠంగా 10 మంది సభ్యులు ఉంటారు.