బెల్లంపల్లి సబ్ కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన మనోజ్

బెల్లంపల్లి సబ్ కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన మనోజ్
  • విద్య, వైద్యం రంగాలపై ప్రత్యేక దృష్టి

బెల్లంపల్లి, వెలుగు: బెల్లంపల్లి సబ్ కలెక్టర్‌గా ఇనుకొండ ఈశ్వర సత్యసాయి దుర్గ మనోజ్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. 2023 బ్యాచ్‌కు చెందిన మనోజ్.. సంగారెడ్డి జిల్లాలో 2024 ఏప్రిల్ నుంచి 2025 జూన్ వరకు అసిస్టెంట్ కలెక్టర్‌గా విధులు నిర్వహించారు. అనంతరం మసూర్‌లో నెల రోజుల శిక్షణ పూర్తి చేశారు. 

బెల్లంపల్లి సబ్ కలెక్టర్​గా బాధ్యతలు చేపట్టిన ఆయన విద్య, వైద్యంపై ప్రత్యేక దృష్టి పెడతానన్నారు. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు. భూకబ్జాలను అరికడతానని.. రెవెన్యూ, పోలీస్ శాఖలతో సమన్వయంతో ప్రభుత్వ భూములను రక్షిస్తానన్నారు. 

తండ్రి రిటైర్డ్​ డీఎస్పీ

ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలానికి చెందిన మనోజ్​ తండ్రి వెంకటేశ్వరరావు 2006–07లో బెల్లంపల్లి పోలీసు సబ్ డివిజన్ పరిధిలో తాండూర్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేయడం విశేషం. 2019లో డీఎస్పీగా పదవీ విరమణ పొందారు. మనోజ్ సోదరి లక్ష్మీమౌనిక ఉస్మానియా డెంటల్ కాలేజీలో సీనియర్ రీసెర్చ్ ఫెలోగా పనిచేస్తున్నారు.