IPL 2024: ముంబై కెప్టెన్‌గా రోహిత్ శర్మ.. మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు

IPL 2024: ముంబై కెప్టెన్‌గా రోహిత్ శర్మ.. మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు

ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్య ప్రస్తుతం విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ఓ వైపు కెప్టెన్సీలో, మరోవైపు ప్లేయర్ గా   విఫలమవుతూ తీవ్ర ఒత్తిడిలో ఉన్నాడు. దీనికి తోడు వ్యక్తిగతంగా ఈ ముంబై ఇండియన్స్ కెప్టెన్ ఆటిట్యూడ్ ఎవరికీ నచ్చడం లేదు. ఎన్నో అంచానాలు మధ్య ముంబై జట్టులోకి రాయల్ గా అడుగుపెట్టిన పాండ్యకు అప్పుడే కష్టకాలం ఎదురైంది. ఇప్పటివరకు పాండ్య కెప్టెన్సీలో ముంబై  ఇండియన్స్ ఆడిన మూడు మ్యాచ్ ల్లో ఓడిపోయింది. ఈ సమయంలో టీమిండియా మాజీ క్రికెటర్ మనోజ్ తివారి సంచలన కామెంట్స్ చేశాడు. 

"ముంబై కెప్టెన్ గా రోహిత్ మళ్ళీ ఎంపిక కావొచ్చు. ఎందుకంటే ఫ్రాంచైజీలు సాహసమైన నిర్ణయాలు తీసుకోవటానికి అసలు వెనుకాడరు. రోహిత్ నుండి కెప్టెన్సీని వారు హార్దిక్ పాండ్యకు అప్పగించారు. ఇప్పుడు ముంబై ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. 5 టైటిల్స్ గెలిచిన రోహిత్ ను ప్రకటించే అవకాశం ఉందని నేను భావిస్తున్నాను. ప్రస్తుతం హార్దిక్ పాండ్య ఒత్తిడిలో ఉన్నట్లు అనిపిస్తుంది. ఏప్రిల్ 7 లోపు రోహిత్ శర్మను కెప్టెన్ గా ప్రకటించే అవకాశం ఉంది". అని మనోజ్ తివారీ బోల్డ్ కామెంట్స్ చేశాడు. 

ఇప్పటివరకు మూడు మ్యాచ్ లు ఆడిన ముంబై ఒక్క మ్యాచ్ లో కూడా గెలవలేదు. గుజరాత్, సన్ రైజర్స్, రాజస్థాన్ రాయల్స్ తో వరుసగా ఓడిపోయి పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది. ముంబై తమ తదుపరి మ్యాచ్ ను ఏప్రిల్ 7న ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఆడబోతుంది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. ఏప్రిల్ 1 న హార్దిక్ సేన రాజస్థాన్ రాయల్స్ తో చివరిసారిగా ఆడింది. దీంతో ఆ జట్టుకు ఆరు రోజుల విరామం దొరికింది. మరి ఈ గ్యాప్ లో ముంబై ఫ్రాంచైజీ ఏమైనా సంచలన నిర్ణయం తీసుకుంటుందో లేదో చూడాలి.