
- మూసీ పరివాహక ప్రాంతాన్ని ..టూరిజం స్పాట్గా డెవలప్చేస్తం
- నదిని ఆనుకుని ఇండ్లు కట్టుకున్నవారికి నష్టం జరగనివ్వం
- పునరావాసం, ఉపాధి కల్పించేందుకు చర్యలు తీస్కుంటం
- మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడి
బషీర్ బాగ్, వెలుగు : మూసీ పరివాహక ప్రాంతాన్ని టూరిజం స్పాట్గా అభివృద్ధి చేస్తామని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. బుధవారం సిటీలోని గోల్కొండ హోటల్ లో బోనాలు, గణేశ్ఉత్సవాలు, మిలాద్ ఉన్ నబీ సక్సెస్ మీట్జరిగింది. ముఖ్యఅతిథిగా మంత్రి పొన్నం పాల్గొని మాట్లాడారు. నదీ తీర ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలకు నష్టం కలగకుండా, మూసీ బ్యూటిఫికేషన్ చేపడతామన్నారు.
నిర్వాసితులందరికీ డబుల్బెడ్రూం ఇండ్లు ఇవ్వడంతోపాటు అన్ని రకాల సహాయ సహకారాలు అందించేందుకు కృషి చేస్తామన్నారు. పునరావాసంతో పాటు ఉపాధి కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అధికారులు సమన్వయంతో బాధ్యతాయుతంగా పనిచేసి, బోనాలు, గణేశ్ ఉత్సవాలు, మిలాద్- ఉన్ -నబీ పండుగను విజయవంతం చేశారన్నారు.
రాబోయే కాలంలోనూ ఇలాగే సమష్టిగా పనిచేసి హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను పెంచాలని సూచించారు. ఈ సందర్భంగా బోనాలు, గణేశ్ ఉత్సవాలు, మిలాద్ ఉన్ నబీ సందర్భంగా కష్టపడి పనిచేసిన అధికారులను మంత్రి సత్కరించారు. హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్, కలెక్టర్ అనుదీప్, అడిషనల్ సీపీ విక్రమ్ సింగ్ మాన్, ట్రాఫిక్ ఏసీపీ విశ్వప్రసాద్, అడిషనల్ కలెక్టర్ వెంకటాచారి, వైద్యాధికారులు పాల్గొన్నారు.