హైదరాబాద్, వెలుగు: టీఎస్పీఎస్సీ నిర్వహించిన ఎగ్జామ్ ‘కీ’లను ఓపెన్ సైట్లో పెట్టాలని పలువురు అభ్యర్థులు అధికారులను కోరుతున్నారు. ఇటీవల పలు పరీక్షల ఫైనల్ ‘కీ’లు రిలీజ్ చేయగా.. వాటిని అందరూ చూడలేకపోతున్నారని తెలిపారు. ఎగ్జామ్స్ రాసిన అభ్యర్థులు మాత్రమే కీ చూసుకునేలా సైట్లో మార్పులు చేశారని వివరించారు. ఓపెన్ సైట్లో పెడితే అందరికీ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని టీఎస్పీఎస్సీ కమిషన్కు రిక్వెస్ట్ చేస్తున్నారు.
కొత్త కమిషన్ ఏర్పాటయ్యాక ఐడీ, హాల్ టికెట్, డేట్ ఆఫ్ బర్త్.. వివరాలు ఎంటర్ చేస్తేనే ఫైనల్ ‘కీ’ చూసుకునేలా టీఎస్పీఎస్సీ మార్పులు చేసింది. జనవరి, ఫిబ్రవరిలో పలు ఎగ్జామ్స్కు సంబంధించిన ఫైనల్ ‘కీ’లపై కూడా ఇలాంటి విధానాన్నే అమలు చేశారు. తాజాగా గురువారం రిలీజ్ చేసిన ఏఈ ఎగ్జామ్ ఫైనల్ కీ లోనూ ఇదే పరిస్థితి ఉంది. ఇలా చేయడంతో వివిధ కారణాలతో పరీక్ష రాయలేని, పేపర్ ప్యాటర్న్ తెలుసుకోవాలనుకునేవారు ఇబ్బంది పడ్తున్నారు.