వారసులొచ్చేశారు.. గెలిచేదెవరో.. ఓడేదెవరో?

వారసులొచ్చేశారు.. గెలిచేదెవరో.. ఓడేదెవరో?
  • వారసులొచ్చేశారు.. గెలిచేదెవరో.. ఓడేదెవరో?
  • పలు చోట్ల ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ
  • కంటోన్మోంట్ నుంచి లాస్య నందిత, వెన్నెల గద్దర్
  • మెదక్ నుంచి మైనంపల్లి రోహిత్, వేములవాడ నుంచి చెన్నమనేని వికాస్ రావు
  • కోరుట్ల నుంచి కే సంజయ్.. కాంగ్రెస్ అభ్యర్థిగా జువ్వాడి నర్సింగరావు
  • సాగర్ నుంచి జైవీర్ రెడ్డి ప్రత్యర్థిగా నోముల నర్సింహయ్య కుమారుడు భగత్
  • పాలమూరు నుంచి మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి కుమారుడు మిథున్ రెడ్డి
  • హుజూరాబాద్ నుంచి మాజీ ఎంపీ కెప్టెన్ మనుమడు ప్రణవ్
  • వేముల వాడ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా చల్మెడ ఆనందరావు కుమారుడు లక్ష్మీనరసింహరావు
  • భూపాల పల్లి నుంచి జంగారెడ్డి కోడలు కీర్తిరెడ్డి
  • ‌నారాయణపేట నుంచి చిట్టెం వారసురాలు పర్ణిక

కోరుట్ల :     
బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు కుమారుడు కే సంజయ్ పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ నుంచి మాజీ మంత్రి దివంగత జువ్వాడి రత్నాకర్ రావు కుమారుడు నర్సింగరావు కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచారు

నాగార్జున సాగర్ :   
ఈ సెగ్మెంట్ నుంచి రాజకీయంగా సుదీర్ఘ అనుభవం ఉన్న జానారెడ్డి కుమారుడు జైవీర్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్థిగా సీనియర్ నేత, దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య కుమారుడు, సిట్టింగ్ ఎమ్మెల్యే నోముల భగత్ బరిలో ఉన్నారు. 

కంటోన్మెంట్ :   
కంటోన్మెంట్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా దివంగత ఎమ్మెల్యే సాయన్న కూతురు లాస్య నందిత బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో నిలిచారు. ఇక్కడ కాంగ్రెస్ తరఫున ప్రజాయుద్ధ నౌక దివంగత గద్దర్ కూతురు వెన్నెల గద్దర్ పోటీ చేస్తున్నారు. 

హైదరాబాద్ : అసెంబ్లీ ఎన్నికల్లో పలువురు సీనియర్ నేతల వారసులు ఎంట్రీ ఇచ్చారు. మూడు ప్రధాన పార్టీల నుంచి బరిలోకి నిలిచారు. మెదక్, పాలకుర్తిలో యువ నాయకులు బరిలో నిలిచారు. తమ ప్రచారంతో కొత్త, పాత తరాలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ నుంచి సీనియర్ నాయకుల రెండో తరం బరిలో ఉండటం ఆసక్తికరంగా మారింది.

* ముఖ్యంగా సికింద్రాబాద్ కంటోన్మెంట్ సెగ్మెంట్ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా దివంగత ఎమ్మెల్యే సాయన్న కూతురు లాస్య నందిత పోటీలో ఉన్నారు. ఆమెకు ప్రత్యర్థిగా ప్రజాయుద్ధ నౌక గద్దర కుమార్తె కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. లాస్య నందిత గతంలో కార్పొరేటర్ గా పనిచేశారు. వెన్నెల మాత్రం రాజకీయాలకు కొత్త. ఇద్దరూ తండ్రులను కోల్పోయిన వారే. వీరిద్దరికీ సెగ్మెంట్ లో సానుభూతి ఉంటుంది. దీంతో ఇక్కడ ఆసక్తికరమైన పోరుసాగుతోంది.

* మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు కుమారుడు రోహిత్ రావు మెదక్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. రోహిత్ రావు రాజకీయ అనుభవం ఉన్న పద్మాదేవేందర్ రెడ్డిని ఎదుర్కోబోతున్నారు. హన్మంతరావు మల్కాజ్ గిరి నుంచి పోటీ చేస్తున్నారు.

* సుదీర్ఘ రాజకీయ అనుభవం, ఏడు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన కందూరు జానారెడ్డి కుమారుడు జైవీర్ రెడ్డి నాగార్జున సాగర్ కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచారు. ఇక్కడి నుంచి మరో సీనియర్ లీడర్, దివంగత నోముల నర్సింహయ్య కుమారుడు భగత్ పోటీ చేస్తున్నారు. దీంతో ఇక్కడ ఇద్దరు సీనియర్ల కుమారులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.

* కోరుట్ల నుంచి బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు కుమారుడు సంజయ్ పోటీ చేస్తున్నారు. సీఎం కేసీఆర్ సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో ఎక్కువ మందికి టికెట్లు ఇచ్చిన విషయం తెలిసిందే. అనారోగ్యంతో ఉన్న విద్యాసాగర్ రావు తన కుమారుడికి టిక్కెట్ ఇవ్వాలన్న అభ్యర్థనకు అంగీకరించినట్టు సమాచారం. ఈయన అభ్యర్థనకు అంగీకరించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. సంజయ్ కి ప్రత్యర్థిగా మరో వారసుడు బరిలో ఉండటంతో ఈ సెగ్మెంట్ పోరు రసవత్తరంగా మారే అవకాశం ఉంది. ఇక్కడి నుంచి మాజీ మంత్రి దివంగత జువ్వాడి రత్నాకర్ రావు కుమారుడు నర్సింగరావు కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచారు.

* హుజూరాబాద్ నుంచి బీఆర్ఎస్ మాజీ ఎంపీ కెప్టెన్ లక్ష్మీకాంతారావు మనుమడు ప్రణవ్ కాంగ్రెస్ తరఫున బరిలో నిలిచారు. ఈయన బీజేపీ కీలక నేత ఈటలపై పోటీకి దిగడం గమనార్హం.

* నారాయణ పేట అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న దివంగత చిట్టెం నర్సిరెడ్డి మనుమరాలు, వెంకటేశ్వర్ రెడ్డి కుతూరు పర్ణికారెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. పక్కనే ఉన్న మక్తల్ నుంచి ఆమె బాబాయ్ రామ్మోహన్ రెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో నిలిచారు.

* భూపాలపల్లి నుంచి మాజీ ఎంపీ జంగారెడ్డి కోడలు కీర్తిరెడ్డి బీజేపీ తరఫున బరిలో నిలిచారు. 2018 ఎన్నికలలోనూ ఆమె బీజేపీ నుంచి భూపాలపల్లిలో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఫిజియో థెరపీలో బ్యాచిలర్స్ డిగ్రీ పూర్తిచేసిన కీర్తి రెడ్డి ప్రస్తుత ఎన్నికలలో మరోసారి తలపడుతున్నారు. ఇక్కడ బీఆర్ఎస్ నుంచి గండ్ర వెంకట రమణారెడ్డి, కాంగ్రెస్ నుంచి గండ్ర సత్యనారాయణ పోటీ చేస్తున్నారు.

* మహబూబ్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి కుమారుడు మిథున్ రెడ్డి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. 

బరిలో యంగ్ స్టర్స్

ఈ సారి అసెంబ్లీ ఎన్నికల బరిలో యంగ్ స్టర్స్ నిలుస్తున్నారు. ప్రధాన పార్టీలు సైతం విద్యాధికులైన యువతీ యువకులకు ఈ సారి టికెట్లు కేటాయించింది. పాలకుర్తి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో ఉన్న యశస్విని రెడ్డి వయస్సు 26 సంవత్సరాలు. ఆమె సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుపై పోటీ చేస్తున్నారు.

నారాయణపేట అభ్యర్థి చిట్టెం పర్ణికారెడ్డి వయస్సు కూడా 30 ఏండ్ల లోపే. ములుగు నుంచి సీతక్కపై బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన బడే నాగజ్యోతి వయస్సు 29 ఏండ్లు. అలాగే మెదక్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మైనంపల్లి రోహిత్ వయస్సు కూడా 30 ఏండ్లలోపే కావడం విశేషం.

హుజూరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి ఒడితెల ప్రణవ్ బాబు వయస్సు 36 ఏండ్లు. బీఎస్పీ ఈ సారి 30 మంది యువతీ యువకులకు టికెట్లు ఇచ్చింది. ఇందులో దేవరకొండ నుంచి వెంకటేశ్ చౌహాన్ , పెద్దపల్లి నుంచి దాసరి ఉష, నకిరేకల్ నుంచి మేడి ప్రియదర్శిని బరిలో ఉన్నారు. బీఎస్పీ వరంగల్ ఈస్ట్ నుంచి ట్రాన్స్ జెండర్ ను ఎన్నికల బరిలోకి దింపడం విశేషం.