పత్తి రైతులు దళారుల మాటలు నమ్మొద్దు

పత్తి రైతులు దళారుల మాటలు నమ్మొద్దు

ఆదిలాబాద్, వెలుగు: పత్తి రైతుకు ప్రారంభంలోనే కష్టాలు మొదలయ్యాయి. క్వింటాల్​పత్తికి రూ.10 వేలు చెల్లించాలని కోరుతున్నా.. ఆఫీసర్లు, వ్యాపారులు పట్టించుకోకపోవడంతో అమ్మేందుకు వెనకడుగు వేస్తున్నారు. ధర లేకపోవడం.. మార్కెట్ తీసుకొచ్చిన పత్తికి తేమ పేరుతో ఎడాపెడా కోతలు పెట్టడం తదితర సమస్యలతో చాలా మంది ఇండ్లలోనే నిల్వ చేస్తున్నారు.

కొన్నది కొంతే..

ఆదిలాబాద్​లో ఈనెల 14 నుంచి కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. మార్కెట్​ఆఫీసర్లు ఇప్పటి వరకు కేవలం 355 క్వింటాళ్ల పత్తి మాత్రమే కొనుగోలు చేశారు. ఏటా కొనుగోళ్లు ప్రారంభం రోజే వందల బండ్లు మార్కెట్లో కనిపించేవి. కొనుగోళ్లు ప్రారంభమై ఐదు రోజులు కావస్తున్నా..మార్కెట్​లో సందడి కనిపించడంలేదు. మార్కెట్ లో ప్రస్తుతం క్వింటాల్​పత్తి రూ. 8,160  పలుకుతుంది. మొదటి రోజు రూ. 8,300 ఇచ్చిన ఆఫీసర్లు ఇప్పుడు రూ.140 తగ్గించడంతో రైతులు అమ్మడానికి ముందుకు రావడంలేదు. 

గ్రామాల్లోకి మహారాష్ట్ర వ్యాపారులు

గతేడాది లాగే ఈసారి కూడా పత్తి కొనుగోళ్లలో అయోమయం నెలకొంది. గతంలో తక్కువ ధర ఉండటం... మహారాష్ట్రలో ధర ఎక్కువగా ఉండడంతో చాలామంది రైతులు అటే తరలించారు. అంతేగాకుండా వ్యాపారులు సైతం జిల్లాకు వచ్చి మరీ కొనుగోలు చేయడం.. గిట్టుబాటు ధర ఇచ్చారు. ఈ ఏడాదీ కొనుగోళ్లకు ముందే మహారాష్ట్ర వ్యాపారులు గ్రామాల్లోకి వచ్చి రైతులను కలుస్తున్నారు. పత్తి తమకే అమ్మాలని కోరుతున్నారు. రైతులు కూడా మహారాష్ట్ర వ్యాపారులకే అమ్మాలని చూస్తున్నారు. వారం రోజులుగా వచ్చిన దిగుబడినంతా ఇళ్లలోనే నిల్వచేస్తున్నారు.

దళారులకు చెక్ పడేనా..

ఆఫీసర్లు దళారులకు చెక్ పెట్టేందుకు చర్యలు ప్రారంభించారు. లైసెన్స్​లేకుండా కొనుగోలు చేసే 14 దుకాణాలకు నోటీసులు ఇచ్చారు. పత్తి కొనుగోలు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. గురువారం నుంచి గ్రామాలకు వెళ్లి పత్తిని మార్కెట్ తరలించాలని, దళారులకు అమ్మి మోసపోవద్దని అవగాహన కల్పించేందుకు కార్యాచరణ రూపొందించారు. 
    
గిట్టుబాటు ధర కల్పిస్తాం

రైతులు వ్యాపారుల మాయమాటలు నమ్మి మోసపోవద్దు. మార్కెట్లోనే రైతులకు గిట్టుబాటు ధర లభిస్తుంది. ఇప్పుడిప్పుడే పంట ఏరుతున్నారు. దీపావళి తర్వాత కొనుగోళ్లు పెరిగే అవకాశం ఉంది. రైతులను ఆదుకునేందుకు అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటున్నాం.
‌‌‌‌- శ్రీనివాస్, మార్కెటింగ్ ఏడీ