దుబ్బలోనే విత్తుకుంటుండ్రు.. ఒకట్రెండు వర్షాలకే పత్తి విత్తనాలు వేస్తున్న రైతులు

దుబ్బలోనే విత్తుకుంటుండ్రు.. ఒకట్రెండు వర్షాలకే పత్తి విత్తనాలు వేస్తున్న రైతులు
  • వారం రోజులుగా జోరుగా సాగు 
  • వర్షాలు ఆగిపోవడంతో స్ప్రింకర్లపై ఆధారం

ఆదిలాబాద్, వెలుగు: ఈ ఏడాది తొలకరికే చాలా మంది రైతులు పత్తి విత్తనాలు వేస్తున్నారు. వారం రోజుల క్రితమే మట్టి దుబ్బలోనే విత్తనాలు వేసిన రైతులు వర్షాల కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు.  కొంత మంది స్ప్రింకర్ల ద్వారా సాగు నీరు అందించాల్సిన పరిస్థితి నెలకొంది. జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది 5.17 లక్షల సాగు విస్తీర్ణం ఉండగా అందులో 4 లక్షల ఎకరాల్లో పత్తి సాగవుతోంది. 

ఇప్పటికే దాదాపు 20 శాతం మంది రైతులు పత్తి విత్తనాలు వేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే మృగశిర కార్తె రోజు నుంచి విత్తుకోవడం మరింత ఉధృతం చేశారు. జిల్లాలో ప్రతి ఏడాది సాంప్రదాయం ప్రకారం మృగృశిర కార్తె తర్వాత ఎక్కువ మంది రైతులు విత్తనాలు వేసుకుంటారు. అయితే ఈ ఏడాది ఆశించిన స్థాయిలో వర్షం పడకపోయినప్పటికీ సాగు మాత్రం ఆగలేదు. అనుకున్న మేర వానలు లేకపోవడంతో విత్తనాలు వేసుకున్న రైతులు ఆందోళనకు గురవుతున్నారు. గతంలో పోలిస్తే ఉష్ణోగ్రతలు కాస్తా తగ్గినప్పటికీ వర్షాలు పడడం లేదు. ఈ పరిస్థితుల్లో విత్తనాలు విత్తుకోవడం మంచిది కాదని అధికారులు చెప్తున్నారు. 

తొందరపడితే నష్టం..

జిల్లాలో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు పడినప్పటికీ పంట సాగు చేసే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలోనే రైతులు తొందరపాటుతో విత్తనాలు వేసుకోవద్దని వ్యవసాయ శాఖ అధికారులు సూచిస్తున్నారు. ఈ ఏడాది సమృద్ధిగా వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ క్రమంలో రైతులు వర్షాల కోసం ఎదురుచూడాలని, మట్టిదుబ్బలో విత్తనాలు వేయడం వల్ల నష్టం జరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. 

జిల్లాలో కనీసం 60 నుంచి 70 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైన తర్వాత విత్తనాలు వేసుకుంటే మంచిదని సూచిస్తున్నారు. తేలికపాటి వర్షాలు కురిసి 35 డిగ్రీలకు తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదైతేనే సాగుకు అనుకూలంగా ఉంటుందని పేర్కొంటున్నారు. బోథ్, ఇచ్చోడ, నేరడిగొండ, జైనథ్, బజార్​హత్నూర్, భీంపూర్, తాంసి, గుడిహత్నూర్ మండలాల్లో చాలా మంది రైతులు పత్తి విత్తనాలు వేసుకున్నారు. అయితే నీటి వసతి ఉన్న రైతులే కాకుండా నీటి సౌకర్యం లేని వారు కూడా విత్తుకోవడంతో వారు వర్షం రాక ఆందోళన చెందుతున్నారు.

పెద్ద వర్షాలు పడిన తర్వాతే విత్తుకోవాలి


రెండు పెద్ద వర్షాలు పడి 60 మిల్లీ మీటర్ల వర్షపాతానికి పైగా నమోదైతేనే విత్తనాలు వేసుకోవాలి. రైతులు తొందరపడి దుబ్బలో విత్తనాలు వేసుకుంటే నష్టపోతారు. విత్తనాలు విత్తుకోవడానికి ఇంకా సమయం ఉంది. ఒకవేళ తొందరపడి విత్తుకుంటే నష్టపోయే అవకాశం ఉంది. అందుకే నేలలో అనువైన తడి ఉన్నప్పుడే విత్తనాలు వేసుకోవాలి.
– వెండి విశ్వమిత్ర, ఏవో, ఆదిలాబాద్