షెడ్యూల్‌‌‌‌కు ముందే పూర్తి చేయాలని.. డెడ్ లైన్ పెట్టుకుని మరీ ప్రభుత్వ కార్యక్రమాలు

షెడ్యూల్‌‌‌‌కు ముందే పూర్తి చేయాలని.. డెడ్ లైన్ పెట్టుకుని మరీ ప్రభుత్వ కార్యక్రమాలు
  • షెడ్యూల్‌‌‌‌కు ముందే పూర్తి చేయాలని.. 
  • డెడ్ లైన్ పెట్టుకుని మరీ ప్రభుత్వ కార్యక్రమాలు
  • శంకుస్థాపనలు చేస్తున్న మంత్రులు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
  • పెండింగ్ పనులు పూర్తి చేయాలని ఆఫీసర్లకు ఆదేశాలు
  • ఈ నెల 6 నుంచి 10 లోపు ఎప్పుడైనా ఎలక్షన్ షెడ్యూల్?

హైదరాబాద్, వెలుగు:  రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్ షెడ్యూల్‌‌కు టైం దగ్గర పడిందనే సంకేతాలు వస్తున్నాయి. దీంతో డెడ్‌‌లైన్లు పెట్టుకుని మరీ ప్రభుత్వ కార్యక్రమాలను చేపడుతున్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాల నేపథ్యంలో మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లోనే మకాం వేశారు. నియోజకవర్గాల్లో అభివృద్ధి కార్యక్రమాలతో పాటు, శంకుస్థాపనల్లో పాల్గొంటున్నారు. అక్టోబర్ మొదటి వారం ముగిసే లోపే ప్రభుత్వానికి సంబంధించిన అన్ని పనులను సర్దేయాలని పెద్దల నుంచి మంత్రులకు స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయని తెలుస్తున్నది. మరోవైపు కేంద్రం కూడా తెలంగాణపై ఫోకస్ పెంచింది. మహబూబ్‌‌నగర్ వేదికగా ప్రధాని నరేంద్ర మోదీ పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. మంగళవారం నిజామాబాద్‌‌లో జరిగే భారీ బహిరంగ సభకు ప్రధాని రానున్నారు. అక్టోబర్ 6వ తేదీ నుంచి 10వ తేదీలోగా ఎప్పుడైనా ఎలక్షన్ షెడ్యూల్ రిలీజ్ అయ్యే చాన్స్ ఉందని అంటున్నారు. ప్రభుత్వ అధికారులు కూడా అదే డెడ్‌‌లైన్​ పెట్టుకుని పెండింగ్ పనులు పూర్తి చేసుకుంటున్నారు.

మూడు రోజులు రాష్ట్రంలోనే ఈసీ బృందం

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సన్నద్ధతపై రివ్యూ చేసేందుకు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (సీఈసీ) రాజీవ్ కుమార్​తో పాటు మరో ఇద్దరు కమిషనర్లు, ఇతర ఈసీ ఉన్నతాధికారులు మంగళవారం రాష్ట్రానికి రానున్నారు. ఎలక్షన్స్​ జరగనున్న నాలుగు రాష్ట్రాల్లో ఈసీ బృందం ఇప్పటికే పర్యటించింది. చివరగా రాష్ట్రానికి వస్తున్నది. రాష్ట్రంలో మూడు రోజుల పాటు అంటే ఐదో తేదీ దాకా ఈసీ బృందం పర్యటించనుంది. సీఎస్, డీజీపీ, ఇతర ఉన్నతాధికారులతో పాటు జిల్లా కలెక్టర్లు, సీపీలు, ఎస్పీలతో సమావేశమై ఎన్నికల నిర్వహణపై వివరాలు అడిగి తెలుసుకోనున్నారు. ఐదో తేదీ సాయంత్రమే ఈసీ బృందం ఢిల్లీకి తిరిగి వెళ్లనుంది. 6వ తేదీన శుక్రవారం ఫుల్ కమిషన్​ ప్రత్యేకంగా సమావేశమై 5 రాష్ట్రాలకు షెడ్యూల్​ను ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. ఒకవేళ ఆ రోజు కుదరకపోతే 10వ తేదీలోగా ఎప్పుడైనా ప్రకటిస్తారని అంటున్నారు. ఎన్నికలకు రెడీగా ఉన్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ కూడా ఇప్పటికే స్పష్టం చేశారు. ఈ లెక్కన నవంబర్ చివరలో తెలంగాణ అసెంబ్లీకి పోలింగ్ జరిగే చాన్స్ ఉన్నదని తెలుస్తున్నది.

బీఆర్ఎస్ నేతల  సుడిగాలి పర్యటనలు

అధికార బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాన్ని మొత్తం చుట్టేస్తున్నారు. రోజుకు ఒకటి, రెండు మండలాలు, ఐదారు గ్రామాల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తున్నారు. కల్యాణలక్ష్మి చెక్కులు, గృహలక్ష్మి లెటర్లు పంపిణీ చేస్తున్నారు. ప్రభుత్వానికి సంబంధించిన అనేక కార్యక్రమాలను పూర్తి చేస్తున్నారు. మంత్రులు కూడా ఎవరూ హైదరాబాద్‌‌కు రావడం లేదు. తప్పనిసరి అయితేనే వచ్చి.. మళ్లీ నియోజకవర్గానికి వెళ్లిపోతున్నారు. మంత్రులు కేటీఆర్, హరీశ్​రావులకు మాత్రం రాష్ట్రం మొత్తం పర్యటించి అభివృద్ధి పనులు పూర్తి చేయాలని సీఎం కేసీఆర్​ ఆదేశించారని, దీంతో వాళ్లు సుడిగాలి పర్యటనలు చేస్తున్నారని నేతలు చెబుతున్నారు.