40% మందికి.. తిండి దొరకలె..

40% మందికి.. తిండి దొరకలె..
  • ఇక్రిశాట్​ స్టడీలో వెల్లడి
  • బంగారం కుదువపెట్టి కుటుంబ పోషణ
  • సామాన్లు అమ్ముకుని తిండి ఖర్చులు
  • 26 శాతం మంది ఉద్యోగాలు పోయాయ్..
  • దీనస్థితిలో 40 శాతం జనాలు

హైదరాబాద్, వెలుగు :  కరోనా.. ప్రపంచ వ్యాప్తంగా ప్రతీ ఒక్కరి జీవితాన్ని ప్రభావితం చేసింది. లాక్​డౌన్​ కారణంగా లక్షలాది మంది ఉపాధి కోల్పోయారు. అన్ని రంగాలు కుదేలయ్యాయి. పెద్ద పెద్ద సంస్థల్లో పని చేసే వారి నుంచి చిరు వ్యాపారుల వరకు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చేయడానికి పని లేకపోవడంతో ఇళ్లు గడవడం కష్టమైంది. ఇలాంటి సమయంలో కొంత మంది బంగారం తాకట్టు పెట్టుకుని కాలం వెల్లదీశారు. మరికొందరు వ్యాపారం చేసే బండ్లు, ఇంట్లోని విలువైన వస్తువులు అమ్మేసి కడుపు నింపుకున్నారు. కొందరైతే ఆకలితో అలమటించిపోయారు. కరోనా టైంలో చాలా మంది నగరవాసులకు ఇలాంటి పరిస్థితులే ఎదురయ్యాయి. ప్రజలు పడిన బాధలు, ఇబ్బందులపై ఇక్రిశాట్ (ఇంటర్నేషనల్ క్రాప్స్ రీసెర్చ్ ఇన్​స్టిట్యూట్​ఫర్ ది సెమీ-ఎరిడ్ ట్రాపిక్స్) స్టడీలో పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకొచ్చాయి. లాక్​డౌన్​ సమయంలో జనాలు ఎంత దుర్భరమైన జీవితాన్ని గడిపారో పరిశోధకులు నివేదికలో తెలిపారు. 

అత్యంత దీనస్థితి

కరోనా పాండెమిక్​లో ప్రజలు అత్యంత దీనస్థితిని అనుభవించారు. ఉపాధి కోల్పోయిన వారు ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులుపడ్డారు. అధ్యయనంలో వెల్లడించిన వివరాల ప్రకారం.. లాక్ డౌన్ లో 26శాతం మంది ఉద్యోగాలు పోయాయ్. కుటుంబాలను పోషించుకునేందుకు 70శాతం మంది బాకీలు చేశారు. 40 శాతం మంది జనాలు తిండి దొరక్క ఇబ్బందిపడ్డట్టు రిపోర్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో తెలిపారు. 2018 అక్టోబర్​కు ముందు.. కరోనా మొదలయ్యాక 2021 జనవరి మధ్యలో ప్రజల ఆర్థిక స్థితిగుతులపై స్టడీ చేశారు. "ఇంపాక్ట్ ఆఫ్​ది కోవిడ్–19 పాండెమిక్ ఆన్ ఫుడ్ సెక్యూరిటీ అండ్ కాపింగ్ స్టాటజీస్ ఇన్ అర్బన్ అండ్ పెరి అర్బన్ ఏరియా ఆఫ్ ది హైదరాబాద్" పేరుతో అధ్యయనం చేశారు. ఇక్రిశాట్​తో పాటు ఈజిప్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని ఆరిష్ నగరానికి చెందిన డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ రూరల్ డెవలప్మెంట్ అరిష్ వర్సిటీ, స్వీడన్ కి చెందిన స్వీడిష్ యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చర్ సైన్సెస్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్స్ కి చెందిన పరిశోధకులు పాల్గొన్నారు.

ఆర్థిక పరిస్థితులు తారుమారు.. 

హైదరాబాద్ లోని అర్బన్, పెరి అర్బన్ ప్రాంతాల్లో ఈ స్టడీ చేశారు. దీనికి ముందు జీహెచ్ఎంసీ నుంచి పర్మిషన్​లెటర్​తీసుకున్నారు. ఆ లెటర్ తో 2018 అక్టోబర్ నుంచి 2019 ఫిబ్రవరి వరకు మొదటి రౌండ్ లో 660 కుటుంబాలను ఎంపిక చేసి వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. మొదటి రౌండ్ లో డేటా కలెక్షన్ తోపాటు జీవన విధానంలో వచ్చిన మార్పులను గుర్తించారు. ఆ తర్వాత 2019 జూన్ నుంచి నవంబర్ వరకు డేటా శాంపిల్స్ సేకరించారు. 2020 మార్చిలో మొదటి లాక్ డౌన్ ఏర్పడిన తర్వాత ఫుడ్ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సెక్యూరిటీ, రోజువారీ ఉపాధులు కోల్పోవడం, వ్యాపారాలు దెబ్బతినడం వంటి వివరాలను సేకరించారు. లాక్ డౌన్ తర్వాత అన్ లాక్–1, 2, 3లలో మార్పులను, జీవన విధానాల్లో ఆర్థిక స్థితిగతులపై డేటా శాంపిల్స్ సేకరించారు. ఏ సమయంలో ఎంత మంది ఉపాధిని కోల్పోయారు..? అన్న వివరాలు సేకరించారు. ఇందులో దాదాపు 70శాతం మంది మధ్యతరగతి, పేద కుటుంబాలకు చెందినవారు కడుపు నింపుకునేందుకు అప్పులు చేశారని వెల్లడించారు. చేతిలో పైసల్లేక తిండి కోసం 40శాతం మంది అలమటించిపోయారు.