పథకం ప్రకారమే రాజ్యాంగంపై వ్యాఖ్యలు: ఆర్​ఎస్​ ప్రవీణ్​

పథకం ప్రకారమే రాజ్యాంగంపై వ్యాఖ్యలు: ఆర్​ఎస్​ ప్రవీణ్​

ఖైరతాబాద్, వెలుగు: సీఎం కేసీఆర్ ​మొదటి నుంచీ దళిత వ్యతిరేకి అని, అంబేద్కర్​చరిత్రను కనుమరుగు చేసేందుకు ఆయన కుట్ర పన్నుతున్నారని పలువురు నేతలు అన్నారు. సోమవారం తెలంగాణ జర్నలిస్టుల అధ్యయన వేదిక అధ్యక్షుడు వేణు గోపాల్ అధ్యక్షతన సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ‘రాజ్యాంగంపై కేసీఆర్ వ్యాఖ్యలు, రాష్ట్ర ఏర్పాటుపై ప్రధాని మోడీ కామెంట్స్ మీద’ రౌండ్ టేబుల్ మీటింగ్​జరిగింది. బీఎస్పీ తెలంగాణ చీఫ్​ కో ఆర్డినేటర్​ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. రాజ్యాంగానికి వ్యతిరేకంగా కేసీఆర్​చేసిన వ్యాఖ్యలు యాదృచ్ఛికం కాదని, ఒక స్క్రిప్ట్ ప్రకారం ఆయన అలా చెబుతున్నారన్నారు. పేద వర్గాలు సంపదలో, అధికారంలో వాటా అడుగుతారనే కుట్రలు పన్నుతున్నారని విమర్శించారు. 

ఆయన లొపలొకటి.. బయటొకటి: జాజుల

సీఎం కేసీఆర్​మనసులో ఒకటి పెట్టుకుని బయటకు మరొకటి మాట్లాడుతున్నారని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. రాజ్యాంగాన్ని మార్చాలని మాట్లాడే కేసీఆర్​దళితులకు ఎన్ని మంత్రి పదవులు ఇచ్చారని ప్రశ్నించారు. అసెంబ్లీలో స్పీకర్ గా ఉన్న బీసీలను పక్కన పెట్టి ఓసీలకు ఇచ్చారని మండిపడ్డారు. చైనా రాజ్యాంగాన్ని మెచ్చుకున్న కేసీఆర్..​ రాజరికం అధికారంలో ఉండాలనే ఆలోచనతోనే ఇలాంటి పనికిరాని ప్రకటనలు చేస్తున్నారని ఫైర్​అయ్యారు. బహుజన మేధావులతో ప్రగతి భవన్ కు వస్తాం, రాజ్యాంగంపై చర్చకు సిద్ధమా అంటూ సవాల్ విసిరారు. సీనియర్ జర్నలిస్ట్​ పీబీ శ్రీనివాస రావు మాట్లాడుతూ.. ఇటీవల మోడీ చేసిన వ్యాఖ్యలు ఆయన ప్రతిష్టను దిగజార్చే విధంగా ఉన్నాయన్నారు. 

కేసు నమోదు చేయాలి: ఇందిరా శోభన్

అంబేద్కర్ లేని రాజ్యాంగాన్ని ఊహించ లేమని, ఎనభై వేల పుస్తకాలు చదివిన వ్యక్తికి ఇది ఎందుకు అర్థం కావడం లేదని ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర కో ఆర్డినేటర్ ఇందిరా శోభన్ అన్నారు. కాంగ్రెస్ నేత మానవతా రాయ్ మాట్లాడుతూ..  కేసీఆర్​దళిత వ్యతిరేకి​ అన్నారు. దళితుడైన అందెశ్రీ రాసినందుకే జయ జయహే తెలంగాణ పాట రాష్ట్ర గీతం కాలేకపోయిందని  మంద కృష్ణ అన్నారు.