ఆ ఊర్లో గాలి, నీరు విషం..6 వేల జనాభాలో ఇంటికో రోగి

ఆ ఊర్లో గాలి, నీరు విషం..6 వేల జనాభాలో ఇంటికో రోగి

సంగారెడ్డి, వెలుగు:ఆ గ్రామం పక్కనే పెద్ద ఫ్యాక్టరీ పడ్తున్నదంటే అందరూ సంబురపడ్డరు. ఇంటికో ఉద్యోగం వస్తదని, అందరి జీవితాలూ బాగుపడ్తయని ఆశపడ్డరు. అనుకున్నట్టు ఫ్యాక్టరీ వచ్చినా ఎవరికీ ఉద్యోగాలు రాలేదు. కానీ ఆ ఫ్యాక్టరీ వెదజల్లుతున్న పొల్యూషన్​తో జనం బతుకులు ఆగమవుతున్నయి. గ్రామంలో ఆరు వేల మంది జనం ఉంటే అందులో దాదాపు వెయ్యి మందికి పైగా వివిధ రోగాల బారిన పడ్డరు. క్యాన్సర్, పక్షవాతం, కిడ్నీ, శ్వాసకోశ, చర్మ వ్యాధులతో మంచం పట్టిన్రు. సంగారెడ్డి జిల్లా కోహిర్ మండలం దిగ్వాల్ గ్రామంలో  ఏ గల్లీలో తిరిగినా పక్షవాతం రోగులే ఎదురుపడుతున్నరు.  రోగాలతో ఓ వైపు ఆరోగ్యం దెబ్బతినడంతో ఏ పనీ చేయలేని పరిస్థితికి చేరుకుంటున్నారు. మరోవైపు ట్రీట్మెంట్​ కోసం హాస్పిటళ్ల చుట్టూ తిరగాల్సి రావడంతో ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 

వెయ్యి మందికి పైగా రోగులు​ 

దిగ్వాల్ లో  ఫార్మా కంపెనీ కారణంగా గడిచిన 15 ఏండ్లలో ఊరంతా కాలుష్యం కమ్ముకున్నది. ఫ్యాక్టరీ వదిలే కెమికల్స్​ కారణంగా గ్రౌండ్ వాటర్ పొల్యూటైంది. తాగే నీళ్లే కాదు, పీల్చే గాలి  సైతం పాయిజన్​లా మారింది. పంటలు పండకపోవడంతో పొలాలను కూడా బీళ్లుగా పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ ఊరి జనాభా 6 వేలు. హెల్త్​ డిపార్ట్​మెంట్​ చెబుతున్న లెక్కల ప్రకారం  వీరిలో దాదాపు వెయ్యి మంది వివిధ దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నారు.  వీటిలో చాలా వ్యాధులకు కారణం పొల్యూషన్ అని డాక్టర్లు చెబుతున్నారు.​ 350 మంది పక్షవాతం, 330 మంది చర్మవ్యాధులు, 185 మంది శ్వాస సంబంధ వ్యాధులతో, 120 మంది కంటి సమస్యలతో బాధపడుతున్నారు. గడిచిన రెండున్నరేండ్లలో 11 మంది కిడ్నీ వ్యాధులబారిన పడగా, వారిలో ఇప్పటికే ఏడుగురు చనిపోయారు.  నాలుగున్నరేండ్ల కాలంలో ఇప్పటికి 8 మంది గ్రామస్తులు క్యాన్సర్​బారిన పడ్డారు. వీరిలో ఐదుగురు మరణించారు. గ్రామ పంచాయతీ 6వ వార్డు మెంబర్ తోంట లక్ష్మి క్యాన్సర్​తో పోరాడుతూ  రెండు నెలల  క్రితం కన్నుమూశారు. 

ఆరోగ్య కేంద్రం మూసేసిన్రు

ఫార్మా కంపెనీ యాజమాన్యం గ్రామంలో హైవే పక్కనే ఏర్పాటుచేసిన ఆరోగ్య సేవ కేంద్రాన్ని ఎలాంటి సమాచారం లేకుండా ఏడాది కింద మూసేసింది.  గ్రామంలో రోగాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుండడంతో ఏడేళ్ల క్రితం గ్రామస్తులు, జిల్లా ఆఫీసర్ల ఒత్తిడితో హెల్త్​ సెంటర్​ను కంపెనీ ఓపెన్​ చేసింది. మొదట్లో గ్రామస్తులకు సక్రమంగానే వైద్య సేవలు అందిస్తూ వచ్చింది. క్రమేణా సేవలు తగ్గిస్తూ ఏడాది కింద పూర్తిగా బంద్​ పెట్టింది. కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నవాళ్లు వారంలో 3 రోజులు డయాలసిస్ ​చేయించుకోవాల్సి వస్తోంది.  చుట్టుపక్కల డయాలసిస్ సెంటర్స్​లేకపోవడంతో వారంతా జహీరాబాద్, సంగారెడ్డిలోని పెద్ద హాస్పిటల్స్​కు పోక తప్పడం లేదు.  దూరప్రయాణం కావడంతో ట్రాన్స్​పోర్ట్ ​చార్జీలు మీద పడుతున్నాయి. హాస్పిటళ్ల చుట్టూ తిరగడం భారమవుతోందని, జిల్లా ఆఫీసర్లు, లీడర్లు ఆలోచించి ఊరిలో డయాలసిస్​ సెంటర్​ ఏర్పాటు చేయాలని, వెంటనే హెల్త్​ సెంటర్​ తెరిపించాలని గ్రామస్తులు కోరుతున్నారు. అలాగే వివిధ వ్యాధుల బారినపడ్డవారి ట్రీట్​మెంట్​ కోసం ఫ్యాక్టరీ నుంచి నష్టపరిహారం ఇప్పించాలని డిమాండ్​ చేస్తున్నారు.