భార్య, వదిన, బిడ్డను చంపి.. ఉరేసుకున్నడు.. పంచాదీ తెంపుతామని వచ్చి హతమైన వదిన

భార్య, వదిన, బిడ్డను చంపి.. ఉరేసుకున్నడు.. పంచాదీ తెంపుతామని వచ్చి హతమైన వదిన
  • వికారాబాద్ జిల్లా కుల్కచర్లలో దారుణం 
  • అనుమానం, భార్యతో గొడవలే కారణం 
  • పంచాదీ తెంపుతామని వచ్చి హతమైన వదిన 
  • బయటకు పరుగెత్తి తప్పించుకున్న పెద్ద కూతురు

పరిగి, వెలుగు: ఇంట్లో గొడవల కారణంగా ఓ వ్యక్తి తన భార్య, వదిన, బిడ్డను కొడవలితో గొంతు కోసి చంపాడు. మరో బిడ్డను కూడా చంపబోగా, ఆమె తప్పించుకున్నది. తర్వాత అతడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వికారాబాద్ జిల్లా కుల్కచర్లలో ఈ దారుణం జరిగింది. 

కుల్కచర్ల మండల కేంద్రానికి చెందిన వేపూరి యాదయ్య (38)కు పగిడ్యాల్​కు చెందిన అలవేలు (32)కు15 ఏండ్ల కింద పెండ్లి జరిగింది. యాదయ్య డెయిలీ లేబర్​గా పని చేస్తున్నాడు. వీరికి ఇద్దరు బిడ్డలు అపర్ణ (13), శ్రావణి (10) ఉన్నారు. అపర్ణ 8వ తరగతి, శ్రావణి నాలుగో తరగతి చదువుతున్నారు.

కొద్ది రోజులుగా అలవేలుపై యాదయ్య అనుమానం పెంచుకున్నాడు. ఈ క్రమంలో ఇరువురి మధ్య తరుచుగా గొడవలు జరుగుతున్నాయి.  గొడవలు ఆగకపోవడంతో గుండుమల్ల మండలం బల్లద్రపల్లికి చెందిన తన అక్క హన్మమ్మ(40)ను అలవేలు కుల్కచర్లకు పిలిపించింది. అలవేలుకు తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోగా అక్క హన్మమ్మ, తమ్ముడు ఉన్నారు. అలవేలు ఇంట్లో గొడవలు జరిగినప్పుడల్లా ఆమె వచ్చి సర్దిచెప్పి వెళ్లేది. శనివారం కూడా ఆమె పంచాదీ తెంపేందుకని వచ్చింది. గ్రామపెద్ద కూడా భార్యాభర్తలిద్దరినీ ఇంటికి పిలిపించి, గొడవ పడొద్దని సర్దిచెప్పి పంపాడు. 

రాత్రి అకస్మాత్తుగా దాడి.. 
శనివారం రాత్రి అందరూ భోజనం చేసి పడుకున్న తర్వాత యాదయ్య అకస్మాత్తుగా తాటిముంజలు కోసే కత్తితో హన్మమ్మపై దాడికి దిగాడు. హన్మమ్మ కేకలు వేయడంతో అలవేలు, పిల్లలు శ్రావణి, అపర్ణ మేలుకొన్నారు. యాదయ్యను అడ్డుకునేందుకు అలవేలు ప్రయత్నించగా, ఆమెపైనా విచక్షణారహితంగా దాడి చేశాడు. ఇద్దరూ రక్తం మడుగులో కుప్పకూలడంతో భయంతో రోదిస్తున్న పిల్లలపైనా దాడి చేశాడు. ముందుగా శ్రావణిని నరికి చంపిన అతడు తర్వాత అపర్ణ వైపు వెళ్లాడు. తలపై, చేతులపై కొడవలితో నరికాడు. ఆ చిన్నారి వెంటనే తలుపు తెరుచుకుని బయటకు పరుగెత్తడంతో తప్పించుకున్నది. ఆ తర్వాత యాదయ్య పక్క రూంలోకి వెళ్లి ఉరి వేసుకున్నాడు.

అపర్ణ పక్కింటివాళ్లకు విషయం చెప్పడంతో వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. భార్యపై అనుమానంతోనే యాదయ్య ఈ హత్యలు చేశాడని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతదేహాలను పరిగి ప్రభుత్వ దవాఖానకు తరలించి పోస్టుమార్టం చేయించారు. 

తర్వాత కుటుంబ సభ్యులకు అప్పగించారు. పరిగి ప్రభుత్వ దవాఖానలో అపర్ణకు ప్రాథమిక వైద్యం చేసి మహబూబ్​నగర్​కు తరలించారు. అపర్ణ ఆరోగ్యం నిలకడగా ఉందని డాక్టర్లు తెలిపారు. ఈ కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని పరిగి డీఎస్పీ శ్రీనివాస్ తెలిపారు.