సంక్షేమంలో వెనుకడుగు వేయం.. ఆర్థిక కష్టాలున్నా ప్రతి సమస్యను పరిష్కరిస్తున్నం: వివేక్ వెంకటస్వామి

సంక్షేమంలో వెనుకడుగు వేయం.. ఆర్థిక కష్టాలున్నా ప్రతి సమస్యను పరిష్కరిస్తున్నం: వివేక్ వెంకటస్వామి
  • పదేండ్లుగా కేటీఆర్ మున్సిపల్ మంత్రిగా ఏం చేశారని ప్రశ్న
  • షేక్ పేట డివిజన్‌‌లో ఎన్నికల ప్రచారంలో మంత్రి

జూబ్లీహిల్స్, వెలుగు: ప్రభుత్వానికి ఆర్థికంగా సమస్యలు ఉన్నా.. ప్రజలకు కావాల్సిన మౌలిక వసతుల కల్పన, సంక్షేమ పథకాలను అందించడంలో వెనుకడుగు వేయడం లేదని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం సంక్షేమాన్ని పేపర్ ప్రకటనలకే పరిమితం చేసిందని, క్షేత్రస్థాయిలో పనులు చేయలేదని ఫైర్‌‌‌‌ అయ్యారు. బీఆర్‌‌‌‌ఎస్‌‌ వర్కింగ్‌‌ ప్రెసిడెంట్‌‌ కేటీఆర్ పదేండ్లుగా మున్సిపల్ శాఖ మంత్రిగా పనిచేసినప్పటికీ హైదరాబాద్‌‌లో నెలకొన్న సమస్యలపై దృష్టి పెట్టలేదని ఆరోపించారు. తాము అధికారంలోకి వచ్చిన రెండేండ్లలో 70 శాతం పనులు పూర్తి చేశామని చెప్పారు.

ఆదివారం షేక్‌‌పేట డివిజన్ సీతానగర్‌‌‌‌లో జరిగిన మున్నూరుకాపు సంఘం నేతల సమావేశానికి మంత్రి వివేక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అలాగే, ఇదే డివిజన్‌‌లోని సత్వా అపార్ట్‌‌మెంట్, టోలిచౌకిలోని ఆనంద్ విహార్ అపార్ట్‌‌మెంట్ వాసులతో మంత్రి అజారుద్దీన్‌‌తో కలిసి సమావేశమయ్యారు. ప్రభుత్వానికి ఎన్ని ఆర్థిక కష్టాలు ఉన్నా.. ప్రజల సమస్యలను పరిష్కరించడంలో వెనుకడుగు వేయబోమని ఆయన స్పష్టం చేశారు. 

నవీన్‌‌ను భారీ మెజారిటీతో గెలిపించండి..
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌‌ అభ్యర్థి నవీన్ యాదవ్‌‌ను అధిక మెజారిటీతో గెలిపిస్తే, ఈ ప్రాంత ప్రజలకు ఆయన నిత్యం అందుబాటులో ఉంటారని మంత్రి వివేక్‌‌ వెంకటస్వామి అన్నారు. షేక్ పేట డివిజన్‌‌లో ఇప్పటివరకు సుమారు రూ.100 కోట్ల నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశామని చెప్పారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని అన్ని డివిజన్‌‌లలో నెలకొన్న సమస్యలను పరిష్కరించామని తెలిపారు. ఈ ప్రాంతంలో కూడా కొందరు కమ్యూనిటీ హాల్ కావాలని అడిగారని, దానిని నిర్మించే బాధ్యత తనదేనన్నారు.

హైదరాబాద్‌‌లో రోజురోజుకు వెహికల్స్ పెరుగుతున్నాయని, దానికి తగ్గట్టు వాహనాల రాకపోకలకు అంతరాయం లేకుండా తమ ప్రభుత్వం రోడ్ల నిర్మాణం చేస్తున్నదని తెలిపారు. త్వరలోనే ఈ ప్రాంతంలో డ్రైనేజీ సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. మరో నాలుగేండ్లు తాము అధికారంలో ఉంటామని తప్పనిసరిగా టోలిచౌకి ప్రాంతంలో ఉన్న ప్రతి సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఆయన చెప్పారు. ఆయా కార్యక్రమాల్లో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, ఫయీమ్ ఖురేషి, స్థానిక నేతలు రంగారావు, మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు.