
- ఆయన ఆస్కార్ స్థాయి కళాకారుడు
- ఒక్కడే లక్షల మందిని ఉత్సాహపరిచాడు
- గద్దర్ పేరుతో ఫోక్లోర్ వర్సిటీ ఏర్పాటు చేయాలి
- కాంగ్రెస్ గద్దర్‌కు తగిన గౌరవం ఇచ్చింది
- గద్దర్ గళం సమావేశంలో వక్తలు
హైదరాబాద్, వెలుగు: సినీ ప్రముఖులు గద్దర్ అవార్డును ఎంతో గర్వంగా తీసుకోవచ్చని, ఆయన గోచి, గొంగడి కట్టి.. తన ఆట, పాటలతో ఎంతో మందిని ఉత్సాహపరిచారని, ఒక కళాకారుడికి ఇంతకంటే ఏం కావాలని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. గద్దర్ ఎన్టీఆర్, ఏఎన్ఆర్ను మించిన యాక్టర్అని, ఆయన ముఖంలో ఉన్న తేజస్సు ఇప్పుడున్న నటుల్లో ఎవ్వరికీ లేదని కొనియాడారు.
కొత్తగా వస్తున్న నటులకు గద్దర్ గురించి తెలియదని ఒక వర్గం సినీ ఇండస్ట్రీ నుంచి అభిప్రాయాలు వస్తున్నాయని, మరి దాదా సాహెబ్‌ఫాల్కే ఎంత మందికి తెలుసని ప్రశ్నించారు. మంగళవారం సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో ‘గద్దర్ అవార్డు– సినీ ఇండస్ట్రీ అవుట్ లుక్’ అనే అంశంపై ‘గద్దర్ గళం’ పేరుతో రచయిత పసునూరి రవీందర్అధ్యక్షతన రౌండ్‌టేబుల్‌సమావేశం నిర్వహించారు.
ప్రొ. కంచె ఐలయ్య మాట్లాడుతూ.. గద్దర్పేరుతో అవార్డులు తీసుకున్నందుకు సినీ వర్గాలు ఆనందపడే రోజులు వస్తాయన్నారు. హరప్పా కాలం నుంచి ఇప్పటి వరకు గద్దర్ లాంటి మహా కళావేత్త భారత దేశంలో పుట్టలేదని తెలిపారు. గద్దర్ ఆస్కార్స్థాయి కళాకారుడని పేర్కొన్నారు. గద్దర్ పేరుతో అవార్డులు ఇవ్వడం గొప్ప విషయమని, సినిమా వాళ్లు కూడా స్పందించేలా ప్రయత్నం చేద్దామని కాంగ్రెస్ లీడర్ రియాజ్ అన్నారు.
బీఆర్ఎస్ వస్తే గద్దర్ రూపు రేఖలు లేకుండా చేసేది: కంచె ఐలయ్య
గత ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఉంటే గద్దర్మరణాన్ని లెక్కచేసేది కాదని, ఆయన రూపురేఖలు లేకుండా చేసేదని కంచె ఐలయ్య అన్నారు. కేసీఆర్ గద్దర్‌ను ప్రగతి భవన్‌లోకి రానివ్వకుండా అవమానించారని గుర్తుచేశారు. గద్దర్ విగ్రహాలను ప్రజలు ప్రతి గ్రామంలో ఏర్పాటు చేసుకోవాలని పిలుపునిచ్చారు.
ఫోక్లోర్ వర్సిటీ ఏర్పాటు చేయాలి: బి.నర్సింగ రావు, పాశం యాదగిరి
గద్దర్ అన్ని సంస్కృతులను, జాతులను గౌరవించారని సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి అన్నారు. ఆయన పేరుతో ఫోక్లోర్ యునివర్సిటీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. చిందు, యక్షగానం, ఒగ్గుకథ.. లాంటి కళారూపాలకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. పదెకరాల స్థలంలో సినీ స్టూడియో నిర్మించి, దేశభక్తి విప్లవం ప్రతిబింబించేలా సినిమాలు తీయాలని కోరారు. జనం పాట పేరుతో గద్దర్ ఒక ఇన్స్టిట్యూట్ పెట్టాలనుకున్నారని డైరెక్టర్బి.నర్సింగరావు తెలిపారు.
సినీ పరిశ్రమ సానుకూలమే: సుద్దాల అశోక్ తేజ
గద్దర్అవార్డు విషయంలో సినీ పరిశ్రమ సానుకూలంగా ఉందని, చిరంజీవి, మోహన్‌బాబు ఇద్దరూ ఈ అవార్డును స్వాగతించారని, ప్రస్తుతం దాసరి నారాయణ రావు లేనందు వల్ల వారిద్దరే సినీ పెద్దలుగా భావించొచ్చని రచయిత సుద్దాల అశోక్ తేజ అన్నారు. నంది అవార్డుకు గద్దర్ పేరు పెట్టడాన్ని తానూ ఆహ్వానిస్తున్నానని, ఈ విషయంలో రేవంత్ రెడ్డిని రెవల్యూషన్ రెడ్డి అనొచ్చని అన్నారు. జానపద జ్ఞానపీఠ్ అవార్డును గద్దర్ పేరు మీద తీసుకొచ్చి, వివిధ దేశాల్లో ఉన్న కళాకారులకు ఇవ్వాలని రచయిత సుద్దాల అశోక్ తేజ అభిప్రాయపడ్డారు.
సినిమానే గద్దర్‌తో ఉంది: డైరెక్టర్ఎన్. శంకర్
నంది అవార్డును గద్దర్అవార్డుగా మార్చడాన్ని ఆహ్వానిస్తున్నానని డైరెక్టర్ ఎన్.శంకర్ తెలిపారు. ఒక్కడే ఆడి పాడి లక్షలాది మందిని ఆలోచింపజేయడం ఒక్క గద్దర్‌కే సాధ్యమని అన్నారు. గద్దర్ పేరు మీద అవార్డు ప్రకటించినప్పుడు తాను అందరికంటే ఎక్కువ హర్షించానని డైరెక్టర్ రఫీ అన్నారు. గద్దర్ అవార్డు అర్హులకు ఇవ్వాలని, కుల, మత విద్వేష రాతలు రాసేవారికి, రాజకీయాల కోసం పని చేసేవారికి ఇవ్వొద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో గద్దర్ కుమారుడు సూర్యం, జర్నలిస్ట్ గోర్ల బుచ్చన్న, డైరెక్టర్లు ప్రేమ్రాజ్ఎనుముల తదితరులు పాల్గొన్నారు.