టెన్త్ ఎగ్జామ్స్ రద్దు చేసిన పలు రాష్ట్రాలు

టెన్త్ ఎగ్జామ్స్ రద్దు చేసిన పలు రాష్ట్రాలు

టెన్త్, ఇంటర్ ఎగ్జామ్స్‌పై ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. కరోనా సెకండ్ వేవ్‌లో కేసులు పెరిగిపోతుండటంతో... పలు రాష్ట్రాలు పరీక్షలను వాయిదా వేశాయి. మరికొన్ని రాష్ట్రాలు ఎగ్జామ్స్‌ను క్యాన్సిల్ చేశాయి. హర్యానాలో టెన్త్ బోర్డ్ ఎగ్జామ్స్ రద్దు చేస్తూ.. పన్నెండో తరగతి పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు హర్యానా విద్యామంత్రి కన్వర్ పాల్ గుజ్జర్ తెలిపారు. 

అదేవిధంగా గుజరాత్ ప్రభుత్వం కూడా పరీక్షలపై కీలక నిర్ణయం తీసుకుంది. టెన్త్ క్లాస్, ట్వల్త్ క్లాస్ పరీక్షలను పోస్ట్ పోన్ చేయాలని గుజరాత్ ప్రభుత్వం నిర్ణయించింది. మే 10 నుంచి 25 మధ్య  10, 12 తరగతుల పరీక్షలను రీషెడ్యూల్ చేస్తామని తెలిపింది. కాగా.. 1 నుంచి 9వ తరగతి విద్యార్థులను మరియు 11వ తరగతి విద్యార్థులను ఎటువంటి ఎగ్జామ్ నిర్వహించకుండా ప్రమోట్ చేస్తామని గుజరాత్ సీఎం కార్యాలయం ప్రకటించింది. 

అటు పంజాబ్‌లోనూ టెన్త్ ఎగ్జామ్స్ రద్దయ్యాయి. పరీక్షలు లేకుండానే 5,8,10వ తరగతి విద్యార్థులను పై క్లాసులకు ప్రమోట్ చేస్తామని సీఎం అమరీందర్ సింగ్ చెప్పారు. ఒడిశాలో కూడా టెన్త్, ట్వల్త్ ఎగ్జామ్స్‌ను వాయిదా వేస్తున్నట్లు నవీన్ పట్నాయక్ ప్రభుత్వం ప్రకటించింది. పరీక్షలు లేకుండానే 9, 11 తరగతి విద్యార్థులను ప్రమోట్ చేయాలని ఆ ప్రభుత్వం నిర్ణయించింది.

యూపీలో స్కూళ్లు మే 15 వరకు బంద్ అయ్యాయి. యూపీలో టెన్త్, ట్వల్త్ ఎగ్జామ్స్  మే 20 తర్వాత నిర్వహిస్తామని యూపీ సర్కారు తెలిపింది. మహారాష్ట్ర ప్రభుత్వం మెడికల్ ఎగ్జామ్స్‌ను వాయిదావేసింది. జూన్‌లో పరీక్షలు పెడతామని ఉద్దవ్ సర్కారు తెలిపింది. తమిళనాడులో టెన్త్ పరీక్షలు రద్దు చేసిన విద్యాశాఖ... విద్యార్థులను ప్రమోట్ చేయాలని నిర్ణయించింది. వాయిదా పడిన పరీక్షలను మే నెలలో నిర్వహిస్తామని తమిళనాడు ప్రభుత్వం తెలిపింది.

కరోనా కేసులు పెరుగుతుండటంతో సీబీఎస్ఈ టెన్త్ పరీక్షలను కేంద్ర విద్యాశాఖ ఇప్పటికే రద్దు చేసింది. సీబీఎస్ఈ ట్వల్త్ స్టాండర్డ్ విద్యార్థుల పరీక్షలను వాయిదావేసింది. ఈ దారిలోనే పలు రాష్ట్రాలు నడుస్తున్నాయి. అయితే... ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం కరోనా నిబంధనలు పాటిస్తూ.. తగు జాగ్రత్తలతో పరీక్షలు నిర్వహిస్తామని ఆ రాష్ట్ర విద్యాశాఖమంత్రి తెలిపారు.