ఢిల్లీలో కాలుష్యం.. ముంబైలో వర్షం!..కొత్త సంవత్సరం తొలిరోజున ప్రధాన నగరాల్లో మిక్స్‌‌డ్‌‌ వెదర్‌‌‌‌

ఢిల్లీలో కాలుష్యం.. ముంబైలో వర్షం!..కొత్త సంవత్సరం తొలిరోజున ప్రధాన నగరాల్లో మిక్స్‌‌డ్‌‌ వెదర్‌‌‌‌

న్యూఢిల్లీ: న్యూ ఇయర్ వేళ ఇటు ఢిల్లీలో కాలుష్యం పెరిగిపోగా, అటు ముంబైలో వర్షం దంచికొట్టింది. 
ఆయా సిటీల్లో గురువారం మిక్స్‌‌డ్‌‌ వెదర్‌‌‌‌ కనిపించింది. దేశ రాజధానిలో ఎయిర్‌‌‌‌ క్వాలిటీ తీవ్ర స్థాయికి పడిపోయింది. ఉదయం 8 గంటల సమయంలో ఢిల్లీలో ఎయిర్‌‌‌‌ క్వాలిటీ ఇండెక్స్‌‌ (ఏక్యూఐ) 371గా నమోదైంది. 

అలాగే, నోయిడాలో ఎయిర్‌‌‌‌ క్వాలిటీ 364, ఘజియాబాద్‌‌ 338, గ్రేటర్‌‌‌‌ నోయిడా 336గా రికార్డయింది. ఢిల్లీలో కాలుష్యంతో పాటు చలి తీవ్రత కూడా ఎక్కువగా ఉంది. బుధవారం గత ఆరేండ్లలో అత్యంత తక్కువ ఉష్ణోగ్రతలు నమోదైన నెలగా డిసెంబర్‌‌‌‌ నిలిచింది. 

సాధారణం కంటే 6.2 డిగ్రీలు తక్కువగా 14.2 డిగ్రీలకు టెంపరేచర్లు పడిపోయాయని వాతావరణ అధికారులు తెలిపారు. మరోవైపు, జనవరి 3 నుంచి ఉష్ణోగ్రతలు మరింత తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందన్నారు. 

హిమాలయాల నుంచి వచ్చే గాలుల వల్ల దేశ రాజధానిలో ఈ పరిస్థితి నెలకొంటుందని పేర్కొన్నారు. అలాగే, గురువారం ఉదయం ముంబైలోని చాలా ప్రాంతాల్లో చిరు జల్లులు కురిశాయి. 6 గంటలకు మొదలై దాదాపు అరగంట సేపు వర్షం కురిసింది.