యూనివర్సిటీల ఇష్టారాజ్యం.. పర్మిషన్లు రాకముందే అడ్మిషన్లు

యూనివర్సిటీల ఇష్టారాజ్యం.. పర్మిషన్లు రాకముందే అడ్మిషన్లు

 

  • పర్మిషన్లు రాకముందే అడ్మిషన్లు..  ఐదింటికి ఇంకా అనుమతులు రాలే
  • కానీ రెండు వర్సిటీల్లో అడ్మిషన్లు.. 
  • గతేడాది నుంచే క్లాసులు
  • లక్షల్లో ఫీజులు వసూలు చేసిన మేనేజ్‌మెంట్లు..
  •  గుర్తింపు లేకపోవడంతో స్టూడెంట్ల ఆందోళన
  • తమ బాధ్యత కాదంటున్న విద్యాశాఖ అధికారులు

హైదరాబాద్, వెలుగు:  రాష్ట్రంలో పలు ప్రైవేటు యూనివర్సిటీల ఇష్టారాజ్యం కొనసాగుతోంది. పూర్తిస్థాయి గుర్తింపు రాకముందే పలు వర్సిటీల మేనేజ్‌మెంట్లు అడ్మిషన్లు చేపట్టాయి. ఇందుకోసం లక్షల్లో ఫీజులు వసూలు చేశాయి. గతేడాది నుంచి క్లాసులు కూడా నిర్వహించాయి. విద్యా సంవత్సరం పూర్తికావొస్తున్న నేపథ్యంలో విషయం బయటపడటంతో స్టూడెంట్లు ఆందోళన చెందుతున్నారు. 

రాష్ట్రంలో 2020–21 నుంచి ప్రైవేటు యూనివర్సిటీలు మొదలయ్యాయి. ఆ సంవత్సరం మహీంద్రా యూనివర్సిటీ, వోక్సెన్‌‌ యూనివర్సిటీ, మల్లారెడ్డి యూనివర్సిటీ, ఎస్‌‌ఆర్‌‌ యూనివర్సిటీ, అనురాగ్‌‌ యూనివర్సిటీకి ప్రభుత్వం అనుమతించింది. గతేడాది సెప్టెంబర్​లో 2022–23 విద్యాసంవత్సరానికి మరో ఐదు యూనివర్సిటీల ఏర్పాటుకు ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లు తీసుకొచ్చింది. గురునానక్ వర్సిటీ (ఇబ్రహీంపట్నం), శ్రీనిధి యూనివర్సిటీ (ఘట్‌‌కేసర్‌‌), ఎంఎన్‌‌ఆర్‌‌ యూనివర్సిటీ (సంగారెడ్డి), నిక్‌‌మర్‌‌ యూనివర్సిటీ ఆఫ్‌‌ కన్‌‌స్ట్రక్షన్‌‌ (శామీర్‌‌పేట), కావేరి యూనివర్సిటీ (గౌరారం) ఉన్నాయి. అసెంబ్లీ పాస్ చేసిన తర్వాత బిల్లును గవర్నర్ ఆమోదం కోసం ప్రభుత్వం రాజ్​భవన్‌‌కు పంపించింది. అయితే ఈ బిల్లును పలు కారణాలతో సర్కారుకు గవర్నర్ తిప్పిపంపించారు. ఇప్పటికే ఐదు ప్రైవేటు వర్సిటీలు ఉండగా.. కొత్తవి ఎందుకని, ఇవి పెరిగితే సర్కారు వర్సిటీల మనుగడకు ఇబ్బందులు ఎదురవుతాయని గవర్నర్ సూచించినట్టు తెలిసింది. దీనికితోడు ప్రైవేటు వర్సిటీల్లో ఫీజులు, ఇతర అంశాలపై కంట్రోల్ లేకపోవడంపై తప్పుపట్టినట్టు సమాచారం. దీనిపై ప్రభుత్వం మరోసారి గవర్నర్‌‌‌‌కు వివరణ ఇస్తూ బిల్లును పంపించనున్నట్లు తెలిసింది.

ఒక్కో కోర్సుకు రూ.2.5 లక్షలు

ఐదు యూనివర్సిటీల బిల్లు అసెంబ్లీలో ఆమోదం పొందగానే.. రెండు, మూడు ప్రైవేటు వర్సిటీలు అడ్మిషన్లకు తెరలేపాయి. గవర్నర్ ఆమోదం రాకున్నా.. గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వకున్నా, అడ్మిషన్ల దందా కొనసాగించాయి. ప్రధానంగా గురునానక్, శ్రీనిధి యూనివర్సిటీల్లో బీటెక్, ఫార్మసీ, డిగ్రీ, అగ్రికల్చర్ తదితర కోర్సుల్లో దాదాపు ఐదువేల దాకా అడ్మిషన్లు చేపట్టాయి. ఒక్కో కోర్సుకు రూ.లక్షన్నర నుంచి రూ.రెండున్నర లక్షల వరకు ఫీజులు వసూలు చేశాయి. అయితే ప్రైవేటు యూనివర్సిటీల మానిటరింగ్ బాధ్యత ఎవరిదనే దానిపై ఇప్పటికీ స్పష్టత లేదు. కేవలం వర్సిటీల ఈసీలో విద్యాశాఖ సెక్రటరీ ఒక్కరే మెంబర్‌‌‌‌గా ఉంటారు. తర్వాత ఏ నిర్ణయంలోనూ హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ పాత్ర లేకపోవడం గమనార్హం.

మాకేం సంబంధం: ఆఫీసర్లు

ప్రభుత్వం నుంచి యూనివర్సిటీలకు గుర్తింపు రాకపోయినా మేనేజ్‌‌మెంట్లు అడ్మిషన్లు చేపట్టడంపై సర్కారు నుంచి స్పందన కరువైంది. ప్రస్తుతం ఆయా వర్సిటీల గుర్తింపు ప్రాసెస్‌‌​లో ఉందని ఓ ఉన్నతాధికారి చెప్పారు. అఫిలియేషన్ లేకున్నా ప్రైవేటు యూనివర్సిటీల్లో అడ్మిషన్లు తీసుకోవడం పేరెంట్స్ రిస్క్ చేసినట్టేనని తెలిపారు. ఇందులో తమ బాధ్యతేమీ లేదని స్పష్టం చేశారు.

విద్యార్థుల ఆందోళన

ఆయా వర్సిటీల్లో అడ్మిషన్లు పొందిన స్టూడెంట్లు ప్రస్తుతం ఆందోళన చెందుతున్నారు. ఇతర సర్కారు వర్సిటీల్లో రెగ్యులర్ స్టూడెంట్లు రెండో సెమిస్టర్ పరీక్షలకు సిద్ధమవుతుండగా, ప్రైవేటు వర్సిటీల్లో మాత్రం ఫస్ట్ సెమిస్టర్ పరీక్షలు కూడా జరగలేదు. కనీసం రెగ్యులర్‌‌‌‌గా క్లాసులు జరగడం లేదని స్టూడెంట్లు చెబుతున్నారు. గురునానక్ కాలేజీలో స్టూడెంట్లు రెండ్రోజులు ఆందోళనలు చేపట్టారు. సర్కారు నుంచి గుర్తింపు లేకున్నా అడ్మిషన్లు ఎందుకు చేపట్టారని ప్రశ్నించారు. లక్షల్లో ఫీజులు వసూలు చేసి, తమ జీవితాలతో మేనేజ్‌‌మెంట్లు ఆడుకుంటున్నాయని, వాటిపై చర్యలు తీసుకోవాలని విద్యార్థులు,  పేరెంట్స్ డిమాండ్ చేస్తున్నారు.