
ఏమైనా వస్తువులు ఫ్రీగా వస్తున్నాయంటే మనవాళ్లు ఊరుకుంటారా..? అబ్బే తగ్గేదేలే అంటుంటారు.. అంతేకాదు.. ఏదైన వస్తువుపై సబ్సిడీ ఇస్తు్న్నారని ప్రచారం జరిగినా అస్సలు ఆ చాన్స్ వదులుకోరు. ఎలాగైనా దాన్ని సొంతం చేసుకోవాలని ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు అచ్చం అలాగే ఉంది.. ఎల్పీజీ సిలిండర్ పై వస్తున్న పుకార్ల అంశం.
500 రూపాయలకే ఎల్‌పీజీ సిలిండర్ ఇస్తున్నారని ప్రచారం జరగడంతో పలువురు మహిళలు హైదరాబాద్‌లోని ఎల్‌పీజీ పంపిణీ కేంద్రాల వద్దకు చేరుకుంటున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందని, ఇప్పుడు ఆ పార్టీ అధికారంలోకి రావడంతో రూ.500కే గ్యాస్ సిలిండర్ ఇస్తారని చాలామంది మహిళలు ఆశతో గ్యాస్ ఏజెన్సీలకు క్యూ కడుతున్నారు.
గ్రేటర్ హైదరాబాద్ లోని గ్యాస్ అవుట్ లెట్ల వద్దకు మహిళలు పెద్ద సంఖ్యలో చేరుకుంటున్నారు. రూ.500కే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నారా..? అని ఆరా తీస్తున్నారు. మహాలక్ష్మీ పథకంలో భాగంగా లబ్ధిదారుల పేర్లను నమోదు చేసుకుంటున్నారని పుకార్లు రావడంతో గ్యాస్ ఏజెన్సీలకు పెద్ద సంఖ్యలో వెళ్తున్నారు.
ముషీరాబాద్, భవానీనగర్, సంతోష్‌నగర్, మలక్‌పేట్, టోలీచౌకీ, అల్వాల్, సనత్‌నగర్ సహా పలు ప్రాంతాల్లోని గ్యాస్ ఏజెన్సీల వద్ద మహిళలు క్యూలైన్లలో కనిపిస్తున్నారు. అయితే.. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం రాబోయే 100 రోజుల్లో తాము ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని చెబుతోంది.
మరోవైపు.. గ్యాస్ సిలిండర్లను సబ్సిడీపై తీసుకుంటున్న వారంతా ఈ కేవైసీ చేయించుకోవాలని ఆదేశించింది. డిసెంబర్ 31వ తేదీ లోపు గడువు కూడా విధించింది. దీంతో చాలామంది ఈ కేవైసీ కోసం కూడా గ్యాస్ ఏజెన్సీల వద్దకు పరుగులు తీస్తున్నారు.
మహిళలు పెద్ద సంఖ్యలో రావడానికి మరో కారణం ఉందంటున్నారు గ్యాస్ ఏజెన్సీల్లో పని చేసే ఉద్యోగులు. మహాలక్ష్మి పథకానికి సంబంధం లేదని, KYC వివరాలను అప్‌డేట్ చేయకుంటే సబ్సిడీలు వెంటనే నిలిపివేస్తారని LPG ఏజెన్సీలు స్పష్టం చేస్తున్నాయి.