మోస్ట్ వాంటెడ్ మావోయిస్టుల పోస్టర్ రిలీజ్

మోస్ట్ వాంటెడ్ మావోయిస్టుల పోస్టర్ రిలీజ్

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మరోసారి మావోయిస్టుల కదలికలు కలకలం రేపుతున్నాయి. భాస్కర్ దళం అడవుల్లోకి ప్రవేశించిందని పోలీసులు నిర్ధారించారు. ఈ క్రమంలో.. సమీపంలో నివాసం ఉంటున్న వారిని అప్రమత్తం చేశారు. మావోయిస్టులు కనిపిస్తే సమాచారం ఇవ్వాలని సూచించారు. ఈ క్రమంలో.. 10మంది మోస్ట్ వాంటెండ్ మావోల పోస్టర్లను కొమురం భీం జిల్లా ఎస్పీ విడుదల చేశారు. 10 మంది మావోయిస్టులపై రూ. 95 లక్షల రివార్డు ఉంది. మైలారపు అడెళ్లు అలియాస్ భాస్కర్ పై రూ. 20 లక్షలు, బండి ప్రకాశ్ అలియాస్ ప్రభాత్ పై రూ. 20 లక్షలు, వర్గీస్ మడేపై రూ. 20 లక్షలు, కుంజం మనీష్ పై రూ. 5 లక్షలు, చెన్నూరి శ్రీను అలియాస్ హరీష్ పై రూ. 5 లక్షల, రోషన్ పై రూ. 5 లక్షలు, నందు అలియాస్ వికాస్ పై రూ. 5 లక్షలు, కంతి లింగవ్వ అలియాస్ అనితపై రూ. 5 లక్షలు, మాడావి మీనాపై రూ. 5 లక్షలు, సంగీతపై రూ. 5 లక్షలు రివార్డు ప్రకటించారు. 

ఆదిలాబాద్, కొమురంభీం, నిర్మల్ జిల్లాల వ్యాప్తంగా పెద్దఎత్తున పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్నారు. గతంలో తప్పించుకున్న మైలరపు అడేళ్లు అలియాస్ భాస్కర్ దళం ప్రవేశించినట్టు నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఇటీవల కాలంలో చాలాసార్లు త్రుటిలో తప్పించుకొని పోలీసులకు భాస్కర్ దళం చుక్కలు చూపించింది. మావోలకు సహకరించినా.. భోజనం పెట్టినా కఠిన చర్యలు తప్పవని పోలీసుల హెచ్చరికలు జారీ చేశారు. గతేడాది సెప్టెంబర్ 20న కడంబా అడవుల్లో భాస్కర్ దళంలో ఇద్దరు అనుచరులను పోలీసులు ఎన్ కౌంటర్ చేశారు. ఆరోజు భాస్కర్ దళం.. తప్పించుకొని మరోసారి ఉనికి చాటేందుకు ప్రయత్నం చేస్తోంది. ఏజెన్సీలో కొత్త రిక్రూట్ మెంట్ దిశగా భాస్కర్ దళం యత్నాలు చేస్తోందని పోలీసులు భావిస్తున్నారు.