ములుగు/రంపచోడవరం: మావోయిస్ట్ అగ్ర నేత మడవి హిడ్మా ఎన్ కౌంటర్లో చనిపోయినట్లు ఏపీ డీజీపీ ప్రకటించడంతో ‘ఆపరేషన్ కర్రె గుట్ట’ మరోసారి వార్తల్లో నిలిచింది. మావోయిస్టు అగ్రనేత మడవి హిడ్మా దళం కర్రె గుట్టలపై ఉందనే పక్కా సమాచారంతో భద్రతా బలగాలు ‘బచావో కర్రె గుట్టలు’ పేరుతో 2025 ఏప్రిల్లో హిడ్మా టార్గె్ట్గా ఆపరేషన్ చేపట్టాయి. హిడ్మా చత్తీస్‌గఢ్‌లోని అబూజ్ మడ్ నుంచి తప్పించుకొని కర్రె గుట్టలపైకి చేరుకున్నట్టు ఇంటెలిజెన్స్ వర్గాలు సమాచారం ఇవ్వగా, కర్రె గుట్టలను భద్రతా దళాలు నలువైపులా చుట్టుముట్టి కూంబింగ్ స్టార్ట్ చేశాయి.
నాలుగైదు ఆర్మీ హెలికాప్టర్లు, డ్రోన్లు, జీపీఎస్ ట్రాకింగ్ సిస్టం సాయంతో 10 వేల మందికి పైగా పోలీసులు అడవుల్లో అణువణువూ గాలించారు. అయితే రోజుల తరబడి బలగాలు కూంబింగ్ నిర్వహించినా హిడ్మా ఆచూకీ లభించలేదు. మావోయిస్టు అగ్రనేత హిడ్మా సహా అతని దళం ఇక్కడి నుంచి తప్పించుకుంది. భద్రతా బలగాల రాకను పసిగట్టి వాళ్లు మకాం మార్చారు. భద్రతా బలగాలు తమ స్థావరాల వద్దకు చేరుకునే సమయాని కంటే ముందుగానే, హిడ్మా అక్కడి నుంచి తప్పించుకొని పోయి ఉంటారని అప్పట్లో పోలీస్ వర్గాలు భావించాయి. తెలంగాణలో తప్పించుకున్న హిడ్మా ఇలా ఏపీలో జరిగిన ఎన్ కౌంటర్లో చనిపోయినట్లు వార్తలు రావడంతో ‘ఆపరేషన్ కర్రె గుట్ట’ మరోసారి వార్తల్లో నిలిచింది.
ఆపరేషన్ కగార్లో ఈ ఏడాది మావోయిస్టు కేంద్ర కమిటీ కార్యదర్శి నంబాల కేశవరావు, కేంద్ర కమిటీ సభ్యులు చలపతి, గణేష్, కట్టా రామచంద్రారెడ్డి, కడారి సత్యనారాయణ రెడ్డి వంటి నాయకులు పోలీస్ ఎన్ కౌంటర్లలో మరణించారు. మల్లోజుల వేణుగోపాల్ అలియాస్అభయ్, ఆశన్న వంటి లీడర్లు తమ టీమ్లతో కలిసి పోలీసులకు లొంగిపోయారు. ఇప్పుడు హిడ్మా కూడా చనిపోయినట్లు పోలీసులు ప్రకటించడంతో.. దండకారణ్యంలో మావోయిస్టుల మనుగడ ప్రశ్నార్ధకంగా మారిందని పోలీసులు చెబుతున్నారు.
