ఛత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్ మావోయిస్టు హిడ్మా పనేనా?

V6 Velugu Posted on Apr 05, 2021

ఛత్తీస్‌గఢ్ బీజాపూర్ జిల్లా తరెంలో జవాన్లపై జరిగిన దాడికి సూత్రధారిగా సుక్మా జిల్లా పువర్తికి చెందిన హిడ్మా ఆయన సహచరి సుజాతగా పోలీసులు అనుమానిస్తున్నారు. మావోయిస్టు పార్టీలో భారీ దాడులకు వ్యూహకర్తగా పేరున్న హిడ్మా.. ప్రస్తుతం పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ నంబర్-వన్ బెటాలియన్‌కు కమాండర్‌గా, ఛత్తీస్‌గఢ్ దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడిగా ఉన్నారు. మావోయిస్టులకు పట్టున్న ప్రాంతం కావడం మరియు తక్కువ సంఖ్యలో భద్రతా బలగాలుండడంతో మావోయిస్టుల దాడి మరింత సులభమైందని తెలుస్తోంది. దాదాపు 400 మంది మావోయిస్టులు ‘యూ’ ఆకారంలో చుట్టుముట్టి దాడి చేసినట్లు తెలుస్తోంది. హిద్మా బీజాపూర్ సరిహద్దుల్లో ఉన్నాడన్న సమాచారం అందుకున్న భద్రతా బలాగాలు కూంబింగ్‌కు వెళ్తుండగా.. ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది.

ఛత్తీస్‌గడ్‌కు చెందిన ఆదివాసి హిడ్మా.. దాదాపు మూడు దశాబ్ధాల క్రితం మావోయిస్టు పార్టీలో చేరాడు. మావోయిస్టు ఆపరేషన్లలో ఆరితేరిన హిడ్మా... దాడులకు వ్యూహలు రూపొందించడంలో దిట్టగా పేరొందాడు. కూబింగ్, CRPF క్యాంపులపై మెరుపు వేగంతో దాడులు చేయడంలో కీలకంగా వ్యవహరిస్తున్నాడు. పార్టీలో రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ విభాగం హిద్మా పరిధిలోనే ఉంటుంది. హిడ్మా దళంలోనే దాదాపు 180 నుంచి 250 మంది నక్సల్స్ ఉన్నట్లు తెలుస్తోంది.

భద్రతా దళాలను మట్టుబెట్టడమే లక్ష్యంగా దండకారణ్య అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ప్రత్యేకంగా ఓ టీంను ఏర్పాటు చేశారు. టాక్టికల్ కౌంటర్ అఫెన్సివ్ క్యాంపెయిన్ కూడా హిడ్మా నేతృత్వంలోనే దాడులకు పాల్పడుతుంటుంది. వీరి ప్రధాన లక్ష్యం కూంబింగ్ ఆపరేషన్లు నిర్వహించే బలగాలను అంతమొందించడమే. దీనివల్ల తమ ఇలాఖాలోకి బలగాలు అడుగుపెట్టకుండా ఉండడమే లక్ష్యంగా టీంను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. దండాకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ ఇంఛార్జీగా కూడా హిద్మా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారని పోలీసులకు సమాచారం ఉంది. హిద్మాపై 50 లక్షల రూపాయల రివార్డు ఉందని, వందల సంఖ్యలో ఘటనలకు హిద్మా కారణమని పోలీసులు చెప్తున్నారు. దండకారణ్యంపై పూర్తి స్థాయి పట్టున్న హిడ్మాను పట్టుకోవడమే లక్ష్యంగా భద్రతా బలగాలు కూంబింగ్ నిర్వహిస్తున్నాయి.

Tagged Chattisgarh, encounter, Maoists, bijapur, sukma

Latest Videos

Subscribe Now

More News