పోలీసుల ప్రలోభాలకు ఆశపడి ఇన్ ఫార్మర్ గా మారొద్దు

పోలీసుల ప్రలోభాలకు ఆశపడి ఇన్ ఫార్మర్ గా మారొద్దు

జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, వరంగల్ (2) డివిజన్ల కమిటీ కార్యదర్శి వెంకటేష్ పేరుతో మావోయిస్టు లేఖ కలకలం రేపుతోంది. విప్లవోద్యమాన్ని నిర్మూలించడానికి పోలీసులు ఇచ్చే డబ్బులకు, ప్రలోభాలకు ఆశపడి వ్యాపారస్తులు, లంపెన్స్ ఇన్ ఫార్మర్ గా మారొద్దంటూ మావోయిస్టులు ఒక లేఖ విడుదల చేశారు.

"2022 వరకు విప్లవోద్యమాన్ని సమూలంగా నిర్మూలించాలనే పథకంలో భాగంగా బీజేపీ నేతలు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్ లు ముఠా ఇన్ ఫార్మర్ నెట్ వర్క్ ను పెంచి పోషిస్తూ పన్నుతున్నారు. కొంతమంది పోలీస్ ఆఫీసర్స్ ప్రమోషన్లకు, రివార్డులకు కక్కుర్తి పడి టీఆర్ఎస్ పార్టీ నాయకుల సెక్షన్ తో లాంపెన్ యువతతో, వ్యాపారస్తులతో సంబంధాలు పెట్టుకొని సమాచారం మాకు డబ్బులు మీకు అని ప్రచారం చేస్తు వారికి లేనిపోని ఆశలు కల్పిస్తూ పోలీస్ ఇన్ ఫార్మర్ గా మార్చుకుంటున్నారు. పోలీసుల ప్రోత్బలంతో కొంతమంది వ్యాపారస్తులు ప్రజలపై విపరీతమైన దోపిడీ చేస్తున్నారు. పోలీసులకు మామూల్లు ఇస్తూ కిరాణంలో వంట సరుకులు ఎక్కువగా తీసుకున్న, కొత్త వ్యక్తులు కనబడ్డ వెంటనే సమాచారం చేరవేస్తున్నారు.

షాపుల దగ్గర సీసీ కెమెరాలు పెట్టి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. రాజకీయ నాయకులను, వ్యాపారస్తులను, గ్రామాలను వారి కంట్రోల్లోకి తీసుకుంటున్నారు. అడవిలో దళాలు తిరిగితే వారికి తెలిపే విధంగా ఫారెస్ట్ వాళ్లను పెడుతూ సమాచారం వెంటనే పోలీసులకు చేరవేస్తున్నారు. గోదావరి ప్రాంత ఓడరేవులలో నీలంపల్లి, బుట్టాయిగూడెం, ముకునూరు, తుపాకులగూడెంతో పాటు అనేక రేవుల్లో నిఘాపెట్టి పోలీస్ ఇన్ఫార్మర్లు పోలీసులకు సమాచారం అందిస్తున్నారు. సీసీ కెమెరాల రక్షణ పేరుతో రాజకీయ నాయకులు, వ్యాపారస్తులు పెట్టిస్తున్నారు. లంపెన్స్ కొంత మంది ఇన్ ఫార్మర్ గా మరి పోలీసులకు సమాచారం అందిస్తున్నారు. సీసీ కెమెరాలు తీసివేయాలి.. వీళ్లంతా వారి పద్ధతులు మార్చుకోకపోతే ప్రజల సమక్షంలో శిక్ష తప్పదని" హెచ్చరిస్తూ మావోయిస్టులు లేఖ విడుదల చేశారు.