
వెంకటాపురం, వెలుగు: మావోయిస్టు కేంద్ర కమిటీ పేరుతో ములుగు జిల్లా వెంకటాపురం మండలం పాత్ర పురం, టేకులగూడెం గ్రామాలలో శనివారం వాల్ పోస్టర్లు ప్రత్యక్షమయ్యాయి. ‘‘సీపీఐ (మావోయిస్టు)21వ వార్షికోత్సవాలను ఈ నెల 21 నుంచి 27 వరకు దేశవ్యాప్తంగా నిర్వహించండి’’ అని వాటిలో పిలుపునిచ్చారు. ‘‘దేశంలో విప్లవోద్యమాన్ని కాపాడుకుందాం! విప్లవ ప్రతిఘాతక పార్టీని, పీఎల్ జీఏను, ఐక్యసంఘటనను నిర్వీర్యం చేసేందుకు ఆపరేషన్ ‘కగార్’ నిర్వహిస్తున్నారు.
ఈ యుద్ధాన్ని విఫలం చేసేందుకు ప్రజలను గెరిల్లా యుద్ధంలో సమీకరిద్దాం”అని అందులో పేర్కొన్నారు. కాగా.. ఇన్నాళ్ల తర్వాత మావోయిస్టు పేరుతో కరపత్రాలు రహదారిపై ప్రత్యక్షం కావడం సర్వత్రా చర్చనీయాంశమైంది. ఈ ప్రకటన మావోయిస్టులు చేశారా? లేక మరెవరైనా ఆకతాయిలు చేశారా? అని పోలీసులు ఎంక్వైరీ ప్రారంభించారు.