ఏపీ-ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దులో మావోయిస్టులు అలజడి... ఆర్టీసీ బస్సుకు నిప్పు

ఏపీ-ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దులో మావోయిస్టులు అలజడి... ఆర్టీసీ బస్సుకు నిప్పు

ఆంధ్రప్రదేశ్‌-ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దులో మావోయిస్టులు అలజడి సృష్టించారు. జగదల్‌పూర్‌ నుంచి విజయవాడ వస్తున్న గన్నవరం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సుకు మావోయిస్టులు నిప్పుపెట్టడంతో పాక్షికంగా దహనమైంది. బస్సులో ప్రయాణిస్తున్న 40 మందిని కిందకు దించి.. డ్రైవర్‌పై చేయిచేసుకుని ఆయన నుంచి సెల్‌ఫోన్‌ లాక్కున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై రంపచోడవరం ఏఎస్పీ మహేశ్వరరెడ్డి మీడియాతో మాట్లాడుతూ చింతూరు.. చట్టి నుంచి భద్రాచలం వైపు వెళ్లే వాహనాలను కూనవరం మీదుగా మళ్లించినట్లు చెప్పారు.

 డిసెంబర్ నెల 22న మావోయిస్టులు భారత్‌ బంద్‌కు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ముందస్తుగా ఈ చర్యలకు పాల్పడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. మావోయిస్టులు తగలబెట్టిన బస్సులోని 40 మంది ప్రయాణికులు, డ్రైవర్.. స్థానిక సీఆర్‌పీఎఫ్‌ క్యాంపు కార్యాలయంలో తలదాచుకున్నారు. వారిని సురక్షితంగా విజయవాడ తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేసినట్లు గన్నవరం డిపో మేనేజర్‌ పి శివాజీ తెలిపారు.