ప్రాణత్యాగానికైనా సిద్ధం.. తుపాకీతో కాల్చినా వెనక్కి తగ్గను: మరాఠా కోటా కోసం జరాంగే ఆమరణ దీక్ష

ప్రాణత్యాగానికైనా సిద్ధం.. తుపాకీతో కాల్చినా వెనక్కి తగ్గను: మరాఠా కోటా కోసం జరాంగే ఆమరణ దీక్ష

ముంబై: మరాఠా కోటా ఉద్యమ నేత మనోజ్ జరాంగే -పాటిల్ ముంబైలోని ఆజాద్ మైదాన్‌‌లో శుక్రవారం ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు. తమ డిమాండ్లు నెరవేరే వరకు ముంబైని వీడబోనని, అవసరమైతే ప్రాణత్యాగానికైనా సిద్ధమని ఆయన ప్రకటించారు. మరాఠా సమాజానికి 10 శాతం ఒబీసీ కోటా, కున్బీ గుర్తింపు కోసం జరాంగే శుక్రవారం ఉదయం 10 గంటలకు దీక్ష చేపట్టారు.

 “నన్ను తుపాకీతో కాల్చినా వెనక్కి తగ్గను. డిమాండ్లు నెరవేరే వరకు ఇక్కడే ఉంటాము” అని ఆయన మద్దతుదారుల సమక్షంలో పేర్కొన్నారు. జల్నా జిల్లాలోని అంతర్వాలీ సరాటి నుంచి వేలాది వాహనాలతో బుధవారం బయలుదేరిన జరాంగేకు శుక్రవారం ముంబైలోకి ప్రవేశించగా వాషీ వద్ద ఘనస్వాగతం లభించింది. ఆజాద్ మైదాన్‌‌లో జరిగిన సభకు వేలాది మంది కేసరి టోపీలు, స్కార్ఫ్‌‌లతో సమావేశమయ్యారు. 

ఈ సందర్భంగా జరాంగే మాట్లాడుతూ “మరాఠాల కోసం నీవు చేసే కృషి ఎంటో చూపించు” మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌‌ను డిమాండ్ చేశారు. తమ డిమాండ్లు నెరవేరితే ఆందోళన ఉపసంహరిస్తామని, లేకుంటే రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు మరాఠా శక్తిని చూపిస్తామని హెచ్చరించారు. రోడ్లను దిగ్బంధించ వద్దని, ముంబై వాసులకు ఇబ్బంది కలగకుండా చూడాలని ఆందోళనకారులకు జరాంగే సూచించారు. 

మరాఠ కోటా ఆందోళనతో ముంబైలోని దక్షిణ, తూర్పు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తాయి. సీఎస్‌‌టీఎం పరిసరాల్లో రద్దీ కారణంగా ఆఫీసులకు వెళ్లే వారు ఇబ్బంది పడ్డారు. ఈ ఆందోళనలకు పోలీసులు ఒక్క రోజు పర్మిషన్ ఇచ్చినప్పటికీ, భారీ సంఖ్యలో ఆందోళనకారులు రావడంతో ఘర్షణల సూచనలు కనిపిస్తున్నాయి. ఓవైపు వర్షంలో తడుస్తున్నా చాలామంది  ఆందోళనకారులు ఆజాద్ మైదాన్‌‌లోనే ఉన్నారు.