Manoj Jarange: మరాఠా కోటాపై నిరాహార దీక్షను విరమించిన మనోజ్ జరాంగే

Manoj Jarange: మరాఠా కోటాపై నిరాహార దీక్షను విరమించిన మనోజ్ జరాంగే

ముంబై: మరాఠాలకు 10% కోటా కోసం ఆజాద్ మైదాన్లో సామాజిక కార్యకర్త మనోజ్ జరాంగే చేసిన నిరాహార దీక్షను ఆయన విరమించారు. ఐదు రోజుల పాటు ఆయన నిరాహార దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. మహారాష్ట్ర ప్రభుత్వం ఆయన పెట్టిన కొన్ని కీలక డిమాండ్లకు అంగీకారం తెలపడంతో దీక్షను విరమించారు. మరాఠా కోటాపై మహారాష్ట్ర కేబినెట్ సబ్ కమిటీ తీసుకొచ్చిన గవర్నమెంట్ రిజల్యూషన్ (GR)ను ఆయన స్వాగతించారు. అనంతరం నిమ్మ రసం తాగి దీక్షను విరమించారు. కేబినెట్ సబ్ కమిటీ హెడ్ రాధాకృష్ణ విఖే పాటిల్ ఆయనతో దీక్షను విరమింపజేశారు.

మరాఠాల కోటాపై కీలక డిమాండ్లకు ప్రభుత్వం అంగీకరించడంతో తన దీక్ష విజయవంతమైందని, అందుకే విరమిస్తున్నానని మనోజ్ జరాంగే చెప్పారు. తమకు ఇవాళ దీపావళి పండుగ అని ఆయన హర్షం వ్యక్తం చేశారు. దీక్ష విరమించిన సందర్భంలో ఆయన భావోద్వేగానికి లోనయ్యారు. కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆయనను వైద్య పరీక్షల నిమిత్తం అంబులెన్స్లో ఆసుపత్రికి తరలించారు. కున్బీలు ఓబీసీ కేటగిరీలో ఉన్నారు కనుక, మరాఠాలను కున్బీలుగా గుర్తిస్తే ప్రభుత్వ ఉద్యోగాలు, చదువుల్లో 10 శాతం రిజర్వేషన్ వస్తుందని చాన్నాళ్లుగా జరంగే డిమాండ్ చేస్తున్నారు.