IND vs ENG 2025: గంటలో టీమిండియాను ఆలౌట్ చేస్తాం.. లార్డ్స్ టెస్ట్ మాదే: ఇంగ్లాండ్ కోచ్

IND vs ENG 2025: గంటలో టీమిండియాను ఆలౌట్ చేస్తాం.. లార్డ్స్ టెస్ట్ మాదే: ఇంగ్లాండ్ కోచ్

లార్డ్స్ టెస్ట్ లో టీమిండియా విజయం ఖరారు అనుకుంటే ఇంగ్లాండ్ అనూహ్యంగా మ్యాచ్ ను ఆసక్తికరంగా మార్చేసింది. 193 పరుగుల స్వల్ప లక్ష్యమే అయినా నాలుగో రోజు ఆట ముగిసేసరికి టీమిండియా 4 వికెట్ల నష్టానికి 58 పరుగులు చేసి కష్టాల్లో పడింది. కేఎల్ రాహుల్ (33 బ్యాటింగ్‌‌‌‌) ఇంగ్లిష్ బౌలర్లకు ఎదురు నిలిచినా.. యశస్వి జైస్వాల్ (0), కెప్టెన్ గిల్ (6), కరుణ్ నాయర్ (14) ఫెయిలయ్యారు. చేతిలో ఇంకో 6 వికెట్లు ఉండగా చివరి రోజు ఇండియాకు మరో 135 రన్స్ కావాలి. పూర్తిగా బౌలర్లకు అనుకూలంగా మారిన పిచ్‌‌‌‌పై బ్యాటింగ్ కష్టంగా మారింది. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్ అసిస్టెంట్ కోచ్ మార్కస్ ట్రెస్కోథిక్ తమ జట్టు గెలుపుపై నమ్మకముంచాడు. 

నాలుగో రోజు ట్రెస్కోథిక్ మాట్లాడుతూ.. " మొదటి గంటలోపు మాకు 6 వికెట్లు లభిస్తాయని ఆశిస్తున్నాము. ఐదో రోజు మొదటి గంట ఆట కీలకంగా మారుతుంది. భారత జట్టుకు విజయం అంత ఈజీ కాదు. బ్యాటింగ్ కు పిచ్ కష్టంగా మారుతుంది. బాల్ తో ఇంగ్లాండ్ ఆధిపత్యం చూపించగలదు". అని ట్రెస్కోథిక్ నాలుగో రోజు ఆట ముగింపులో విలేకరుల సమావేశంలో అన్నాడు. మరోవైపు టీమిండియా ఆల్ రౌండర్ వాషింగ్ టన్ సుందర్ లార్డ్స్ టెస్టులో  టీమిండియా లంచ్ తర్వాత ఘన విజయ సాధిస్తుందని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. రాహుల్, పంత్ పైనే భారత జట్టు ఆశలు పెట్టుకుంది. నితీష్, జడేజా, సుందర్ రూపంలో బ్యాటింగ్ డెప్త్ ఉండడం కలిసి రానుంది. 

Also Read:-దుమ్మురేపిన డికాక్.. రెండోసారి MLC ట్రోఫీ ఎగరేసుకుపోయిన MI న్యూయార్క్

వికెట్ నష్టపోకుండా 2 పరుగులతో నాలుగో రోజు ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్ లో మన బౌలర్లు చెలరేగడంతో  కేవలం 192 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో ఇండియా ముందు 193 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఉంచగలిగింది. 40 పరుగులు చేసిన రూట్ టాప్ స్కోరర్ కాగా మిగిలిన వారు విఫలమయ్యారు. ఎలాంటి అద్బుతం జరగకుండా ఉంటే ఈ మ్యాచ్ లో టీమిండియా గెలుపు ఖాయంగా కనిపిస్తోంది. భారత బౌలర్లలో సుందర్ నాలుగు వికెట్లు తీసుకున్నాడు.  బుమ్రా, సిరాజ్ రెండు.. ఆకాష్ దీప్, నితీష్ కుమార్ తలో వికెట్ పడగొట్టారు. తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ 387 పరుగులు చేయగా.. ఆతర్వాత ఇండియా కూడా సరిగ్గా 387 పరుగులు చేసింది.