60 లక్షలు దాటిన ‘మార్గదర్శి’ సబ్​స్క్రయిబర్లు

60 లక్షలు దాటిన ‘మార్గదర్శి’ సబ్​స్క్రయిబర్లు
  • మార్గదర్శి చిట్స్​ ఎండీ శైలజా కిరణ్

హైదరాబాద్​, వెలుగు: దక్షిణాది రాష్ట్రాల్లో మార్కెట్​ లీడర్​ అయిన మార్గదర్శి చిట్​ఫండ్స్​ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రూ.12 వేల కోట్ల టర్నోవర్​ను టార్గెట్​గా పెట్టుకుంది. తెలుగు రాష్ట్రాల్లో మరిన్ని బ్రాంచ్​లను ఏర్పాటు చేయాలని నిర్ణయించుకుంది. సంస్థకు 60 ఏళ్లు నిండిన సందర్భంగా హైదరాబాద్​లో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో సంస్థ ఎండీ శైలజా కిరణ్​ మాట్లాడారు. ‘‘మేం తెలుగు రాష్ట్రాలతోపాటు కర్నాటక, తమిళనాడులో కార్యకలాపాలు నిర్వహిస్తున్నాం.

సబ్​స్క్రయిబర్ల సంఖ్య 60 లక్షలకు చేరింది. సంస్థలో 4,300 మంది ఎంప్లాయీస్​ ఉన్నారు. 108 బ్రాంచ్​లు, 6,217 చిట్​గ్రూప్స్​ ఉన్నాయి. ప్రస్తుతం బిజినెస్ చేస్తున్న ప్రాంతాల్లో బ్రాంచ్​ నెట్​వర్క్​ను ఇంకా పటిష్టం చేస్తాం కానీ మరిన్ని రాష్ట్రాలకు వెళ్లే ఆలోచన లేదు. నెలకు రూ.650 కోట్ల విలువైన అమౌంట్​ బిడ్డర్లకు ఇస్తున్నాం. మాది అప్పులు లేని కంపెనీ. మా రికవరీ రేటు 99 శాతం వరకు ఉంది. చిట్​ఆక్షన్​, డబ్బు చెల్లించే విషయంలో కఠినమైన రూల్స్​పాటిస్తున్నాం. అందుకే సబ్​స్క్రయిబర్లకు మాపై ఎంతో నమ్మకం. కస్టమర్​కు వైద్యపరమైన ఎమర్జెన్సీ ఉంటే మూడు రోజుల్లోనే డబ్బు ఇస్తున్నాం. 60వ వార్షికోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నాం. ఉద్యోగులకు నెల జీతం బోనస్​గా చెల్లిస్తున్నాం.సబ్​స్క్రయిబర్లకు కూడా బహుమతులు ఇస్తున్నాం. చిట్​ఫండ్​ సర్వీసులపై జీఎస్టీని 12 శాతం నుంచి 18 శాతానికి పెంచడం బాధాకరం”అని ఆమె వివరించారు.