శ్రీరామ నవమి పండుగ వేళ భారత స్టాక్ మార్కెట్లు భారీ పతనాన్ని నమోదు చేశాయి. మార్కెట్లు ట్రేడింగ్ మెుదలుపెట్టగానే ఊహించని రీతిలో నష్టాల్లోకి జారుకున్నాయి. అంతర్జాతీయ పరిణామాలు.. ముఖ్యంగా ఇరాన్ యుద్ధం చుట్టూ ముసురుతున్న అనిశ్చితి పెట్టుబడిదారుల సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. దీంతో మార్కెట్లు భారీగా పతనమై బ్లాక్ ఫ్రైడే నమోదైంది మార్కెట్లలో.
కుప్పకూలిన మార్కెట్లు:
ఉదయం 10 గంటల సమయానికి సెన్సెక్స్ 1,000 పాయింట్లు నష్టపోయి 74,272 వద్ద ట్రేడవ్వగా, నిఫ్టీ 300 పాయింట్లు కోల్పోయి 23,006 స్థాయికి పడిపోయింది. మార్కెట్‌లో అమ్మకాల ఒత్తిడి ఎంతలా ఉందంటే.. దాదాపు 2,398 షేర్లు నష్టాల్లో పయనించగా, కేవలం 943 షేర్లు మాత్రమే లాభాల్లో ఉన్నాయి.
ఇరాన్ యుద్ధం - ముగియని అనిశ్చితి:
యుద్ధం త్వరలోనే ముగుస్తుందన్న ఆశలు అడియాశలు కావడమే తాజా పతనానికి ప్రధాన కారణం. అమెరికా ప్రతిపాదించిన శాంతి ఒప్పందం "ఏకపక్షంగా, అన్యాయంగా" ఉందని ఇరాన్ ప్రకటించడంతో ఉద్రిక్తతలు మళ్లీ పెరిగాయి. దీనికి తోడు మధ్యప్రాచ్యానికి అదనంగా 10వేల మంది సైనికులను పంపేందుకు పెంటగాన్ ప్లాన్ చేస్తోందనే వార్తలు ఆందోళనలు పెంచేస్తున్నాయి.
ALSO READ : యుద్ధం ఎఫెక్ట్: ఎరువుల తయారీ..క్రిసిల్ రేటింగ్స్ వెల్లడి
మండిపోతున్న ముడిచమురు:
బ్యారెల్ ముడిచమురు ధర 100 డాలర్ల మార్కు పైన కొనసాగుతుండటం భారత్ వంటి దిగుమతి దేశాలకు పెను సవాలుగా మారింది. బ్రెంట్ క్రూడ్ ఒక్కరోజే 5.7% పెరిగి 106 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. యుద్ధం సుదీర్ఘకాలం కొనసాగితే చమురు ధరలు భారత్ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
రికార్డు కనిష్టానికి రూపాయి:
చమురు ధరల సెగ రూపాయికి కూడా తగిలింది. చరిత్రలో మొదటిసారి రూపాయి విలువ డాలర్‌తో పోలిస్తే 94 మార్కును దాటి 94.25 వద్ద రికార్డు కనిష్టానికి పడిపోయింది. యుద్ధం మొదలైనప్పటి నుంచి రూపాయి దాదాపు 4% మేర క్షీణించింది. విదేశీ ఇన్వెస్టర్లు నిరంతరం నిధులను వెనక్కి తీసుకోవడం రూపాయిపై మరింత ఒత్తిడిని పెంచుతోంది.
భవిష్యత్తుపై ఆందోళన:
మార్కెట్ అస్థిరతను సూచించే 'ఇండియా VIX' 7% పెరగడం, రాబోయే రోజుల్లో మరిన్ని అమ్మకాలు ఉండవచ్చని సూచిస్తోంది. యుద్ధం ఎంత త్వరగా ముగిస్తే మార్కెట్లు అంత వేగంగా కోలుకుంటాయని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
