నిమిషాల్లో కుప్పకూలిన మన స్టాక్ మార్కెట్లు.. రూ.7 లక్షల కోట్లు ఆవిరి.. ఎందుకంటే?

నిమిషాల్లో కుప్పకూలిన మన స్టాక్ మార్కెట్లు.. రూ.7 లక్షల కోట్లు ఆవిరి.. ఎందుకంటే?

ఉదయం లాభాల్లో స్టార్ట్ అయిన స్టాక్ మార్కెట్లు కొన్ని నిమిషాల్లోనే ఊహించని నష్టాల దిశగా క్లోజ్ అయ్యాయి. మార్కెట్ల ముగింపునకు కొన్ని నిమిషాల ముందు ఒక్కసారిగా అమ్మకాల ఒత్తిడి పెరిగిపోవటంతో ఒకానొక దశలో సెన్సెక్స్ 1500 పాయింట్లు నష్టపోయింది. దీంతో ఇన్వెస్టర్ల సంపద దాదాపు 7 లక్షల కోట్ల రూపాయల మేర ఆవిరైపోయింది. 

మార్కెట్ల క్లోజింగ్ సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 1092 పాయింట్ల నష్టంతో ముగియగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 359 పాయింట్లు కోల్పోయింది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 614 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 835 పాయింట్లు పడిపోయాయి. ప్రధానంగా ఆటో, మెటల్స్, ఆయిల్ అండ్ గ్యాస్ స్టాక్స్ మార్కెట్లను నష్టాల దిశగా నడిపించాయి. ఐటీ స్టాక్స్ మెరుగైన పనితీరుపో పుంజుకున్నప్పటికీ పతనానికి కీలక కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

1. అమెరికా-ఇరాన్ శాంతి ఒప్పందంపై సందిగ్ధత:
అమెరికా, ఇరాన్ దేశాల మధ్య కాల్పుల విరమణ పొడిగింపు, హార్ముజ్ జలసంధి ద్వారా రవాణా ఆంక్షల తొలగింపుపై ప్రాథమిక అంగీకారం కుదిరినట్లు వార్తలు వచ్చాయి. అయితే దీనిపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇంకా ఆమోదం తెలపకపోవడం, ఇరాన్ అధికారిక మీడియా కూడా ఇది ఇంకా ఖరారు కాలేదని చెప్పడంతో మార్కెట్లలో సందిగ్ధత నెలకొంది. బ్రెంట్ క్రూడాయిల్ ధర బ్యారెల్‌కు 93 డాలర్లకు పడిపోయినప్పటికీ, స్పష్టత లేకపోవడంతో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.

2. FII అమ్మకాలు:
విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు భారత మార్కెట్ల నుంచి తమ పెట్టుబడులను భారీగా వెనక్కి తీసుకుంటున్నారు. తాజా తాత్కాలిక డేటా ప్రకారం.. బుధవారం ఒక్కరోజే వీరు రూ.1,040 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. ఈ ఏడాది ఇప్పటివరకు వీరు ఏకంగా 24.3 బిలియన్ డాలర్ల విలువైన షేర్లను అమ్మేశారు. ఇది 2025 నాటి రికార్డు స్థాయి అవుట్‌ఫ్లోను దాటేసింది.

3. వాతావరణ శాఖ బ్యాడ్ న్యూస్:
దేశవ్యాప్తంగా ఎండతీవ్రత కొనసాగుతున్న తరుణంలో భారత వాతావరణ శాఖ నైరుతి రుతుపవనాల అంచనాను 92% నుంచి 90%కి తగ్గించింది. జూన్ నుండి సెప్టెంబర్ వరకు సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించింది. అంతేకాకుండా ఎల్-నినో పరిస్థితులు ఏర్పడుతుండటంతో రుతుపవనాల రాక కూడా ఆలస్యమవుతోంది. ఇది గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, ద్రవ్యోల్బణంపై ప్రభావం చూపుతుందనే ఆందోళన మార్కెట్లను కుదిపేసింది.

4. ఎంఎస్‌సీఐ రీబ్యాలెన్సింగ్:
ఎంఎస్‌సీఐ గ్లోబల్ స్టాండర్డ్ ఇండెక్స్‌(MSCI)లో మార్పులు మే 29 నుంచి అమలులోకి వస్తున్నాయి. ఈ మార్పుల ప్రకారం ఫెడరల్ బ్యాంక్, ఎంసీఎక్స్ , నాల్కో, ఇండియన్ బ్యాంక్ షేర్లు ఇండెక్స్‌లో చేరుతుండగా.. హ్యుందాయ్ మోటార్ ఇండియా, జూబిలెంట్ ఫుడ్‌వర్క్స్, కల్యాణ్ జ్యువెలర్స్, రైల్ వికాస్ నిగమ్ వంటి ప్రముఖ షేర్లను ఇండెక్స్ నుంచి తొలగిస్తున్నారు. ఈ రీబ్యాలెన్సింగ్ వల్ల ఆయా షేర్లలో తీవ్ర ఒత్తిడి కనిపించింది.

5. పెరిగిన ఇండియా విక్స్:
మార్కెట్లో అస్థిరతను సూచించే 'ఇండియా విక్స్' ఏకంగా 6 శాతం పెరిగి 15.91 స్థాయికి చేరుకుంది. విక్స్ పెరగడం అనేది మార్కెట్లో బయ్యర్ల కంటే సెల్లర్లు ఎక్కువ యాక్టివ్‌గా ఉన్నారనే సంకేతాన్ని ఇస్తుంది.