- ఈ ఏడాది ఖమ్మం మార్కెట్ ఆదాయం రూ.21 కోట్లు
- గత ఆర్థిక సంవత్సరం కంటే రూ.9 కోట్లు తక్కువ
- గతేడాది మార్కెట్ కు 11 లక్షల బస్తాల మిర్చి రాక ఈసారి వచ్చినవి 4 లక్షల లోపే..
- మిర్చి సాగు తగ్గడం, పంట దిగుబడి లేకపోవడం కారణం
ఖమ్మం, వెలుగు: ఈ ఏడాది ఖమ్మం జిల్లాలో మిర్చి సాగు తగ్గడంతో ప్రభావం మార్కెట్ ఆదాయంపై పడింది. రెండు, మూడేళ్లుగా తెగుళ్లు, రోగాల కారణంగా సరైన దిగుబడి లేకపోవడం, పండిన పంటకు కూడా సరైన ధర రాకపోవడంతో ఈసారి చాలా మంది రైతులు మిర్చి సాగు చేయడం తగ్గించేశారు. దీంతో మూడేళ్ల కింద ఖమ్మం జిల్లాలో లక్షా 20 వేల ఎకరాలకు పైగా భూముల్లో మిర్చి సాగు జరగ్గా, ఈ ఏడాది దాదాపు 65 వేల ఎకరాలకు తగ్గింది.
గతేడాది తేజా రకం మిర్చి ధర క్వింటాకు రూ.16 వేలకు మించకపోవడం కూడా ఈ పరిస్థితికి కారణమైంది. దీంతో సాగు విస్తీర్ణం తగ్గిపోయి, ఈ ఏడాది కూడా పంట దిగుబడి తక్కువగానే ఉండడంతో ఖమ్మం వ్యవసాయ మార్కెట్ ఆదాయం అంతకుముందు ఏడాదితో పోలిస్తే దాదాపు 40 శాతం తగ్గిపోయింది. 2024– 25 ఆర్థిక సంవత్సరంలో రూ.30 కోట్ల ఆదాయం రాగా, 2025– 26 ఆర్థిక సంవత్సరం నేటితో ముగుస్తుండగా ఆదాయం మాత్రం రూ.21 కోట్లు దాటలేదు.
తేజ రకం ప్రత్యేకం..
జిల్లాలో ఖమ్మం వ్యవసాయ మార్కెటే పెద్దది. రాష్ట్రంలో విస్తీర్ణం పరంగా రెండో అతి పెద్దది కూడా ఈ మార్కెటే.. ఇక్కడికి ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాల నుంచే కాకుండా ఏపీలోని కృష్ణా జిల్లా నుంచి కూడా మిర్చిని తీసుకువస్తారు. అపరాలు, పత్తి మార్కెట్ కూడా ఉన్నా, ఇక్కడ ప్రధాన ఆదాయ వనరు తేజ రకం మిర్చి మాత్రమే. ఇక్కడి నుంచి దేశంలోని వివిధ రాష్ట్రాలకే కాకుండా, బంగ్లాదేశ్, చైనా, థాయ్ లాండ్, మలేషియా, సింగపూర్ లాంటి దేశాలకు తేజా మిర్చి ఎగుమతి అవుతుంది.
మార్కెట్ లో జరిగిన వివిధ రకాల పంటల అమ్మకాల్లో 1 శాతం విలువను సెస్ గా వసూలు చేస్తారు. గత ఆర్థిక సంవత్సరంలో ఖమ్మం మార్కెట్ కు 11 లక్షల బస్తాల మిర్చిని రైతులు అమ్మకానికి తీసుకువచ్చారు. కానీ, ఈ ఏడాది మాత్రం ఇప్పటి వరకు కేవలం 4 లక్షల బస్తాల మిర్చిని మాత్రమే తెచ్చారు. అయితే గతేడాది తేజా రకం మిర్చికి యావరేజీగా క్వింటాకు రూ.12 వేల చొప్పున ధర పలకగా, ఈసారి ఆ మొత్తం రూ.16 వేలుగా నమోదైంది. మూడు వారాల కింద క్వింటా రూ.21 వేల వరకు రేటు పెరిగినా, ప్రస్తుతం రూ.19 వేలకు దగ్గరలో ధర నిలకడగా ఉంది.
మార్కెట్‌పై ప్రభావం..
జిల్లాలోని వ్యవసాయ భూములు మిర్చి సాగుకు అనుకూలంగా ఉండగా, గతంలో రైతులు పోటీపడి పంటను సాగు చేసేవారు. గత కొన్నేళ్ల నుంచి నల్లి పురుగు, తామర పురుగు వంటి ప్రభావం వల్ల పెట్టుబడి ఖర్చులు పెరిగి, దిగుబడి క్రమంగా తగ్గుతూ వస్తోంది. గతంలో ఎకరానికి 25 క్వింటాళ్ల వరకు దిగుబడి రాగా, తెగుళ్ల కారణంగా ప్రస్తుతం 10 క్వింటాళ్ల దిగుబడి కూడా రావడం లేదని రైతులు చెబుతున్నారు.
ఈ కారణంగానే ఈసారి మిర్చికి బదులు, పత్తి, మొక్కజొన్న పంటలు సాగు చేశారు. అయితే పత్తి ఎక్కువగా సీసీఐకి అమ్మడంతో ఆ ఆదాయం వ్యవసాయ మార్కెట్ కు రాలేదు. మొక్కజొన్నలు కూడా ఇంకా మార్క్ ఫెడ్ కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాలేదు. దీంతో ప్రధాన ఆదాయ వనరు మిర్చి రాకపోవడంతో ఖమ్మం మార్కెట్ ఆదాయంపై ప్రభావం పడింది.
