మార్కెట్లు పడావు! .. ఎన్నికల ముందు ఆర్భాటంగా ప్రారంభించిన గత సర్కారు

మార్కెట్లు పడావు! .. ఎన్నికల ముందు ఆర్భాటంగా ప్రారంభించిన గత సర్కారు
  • వ్యాపారులకు కేటాయించకపోవడంతో వృథాగా స్టాల్స్​
  • దీంతో రోడ్లపై బిజినెస్ చేసుకుంటున్న వీధి వ్యాపారులు
  • రూ.90 కోట్లతో నిర్మించిన ఐటీ పార్కుతో సంగతి అంతే..

నల్గొండ, వెలుగు : ఉమ్మడి జిల్లాలో గ్రేడ్​వన్​మున్సిపాలిటీగా గుర్తింపు  పొందిన నల్గొండలో  వందల కోట్లతో నిర్మించిన మార్కెట్లు పడావు పడ్డాయి. అత్యాధునిక సదుపాయాలతో నిర్మించిన వెజ్​, నాన్​వెజ్​, ఫ్రూట్​ మార్కెట్లు, రైతుబజార్‌‌‌‌‌‌‌‌లు ఖాళీగా దర్శనమిస్తున్నాయి.  బీఆర్ఎస్​ ప్రభుత్వం హయాంలో నిర్మించిన వీటిని ఎన్నికలకు ముందు ఆర్భాటంగా ప్రారంభించారు.  కానీ, ఎవరికీ కేటాయించకపోవడంతో విక్రయదారులు రోడ్లపైనే వ్యాపారాలు చేసుకుంటున్నారు. మార్కెట్ల నిర్మాణాల్లో లోపాలు ఉన్నాయని స్థానిక వ్యాపారులు చెబుతుండగా.. అధికారులు మాత్రం స్పందించడం లేదు. 

హడావుడిగా ప్రారంభోత్సవాలు

మున్సిపాలిటీలో రూ.1.11 కోట్లతో రైతుబజార్‌‌‌‌‌‌‌‌, రూ.8 కోట్లతో సమీకృత వెజ్​, నాన్​వెజ్​ మార్కెట్ నిర్మాణంతో పాటు రూ. 12.50 లక్షలతో ఫ్రూట్​ స్టాల్స్​ ఏర్పాటు చేశారు.  మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్​రెడ్డి, మాజీ మంత్రి​కేటీఆర్‌‌‌‌‌‌‌‌ అక్టోబర్​2న మార్కెట్లు, ఫ్రూట్​స్టాల్స్​హడావుడిగా ఓపెన్ చేశారు.  అందుబాటులో ఉన్న వ్యాపారులను గుర్తించి కొన్ని షాపులు కేటాయించినా..  రెండు రోజులకే వాళ్లు యథావిధిగా మళ్లీ రోడ్ల పైకొచ్చేశారు.  

కొందరికి ముందు వరుసలోని షాపులు, ఇంకొందరికి వెనక వైపు షాపులు ఇచ్చారని వాళ్లు చెప్పారు. అలాగే పానగల్లు వద్ద చేపల మార్కెట్​నిర్మించాలని నిర్ణయించి.. అలాగే నకిరేకల్, రేణిగుంట హైవే పక్కన చేపలు అమ్ముతున్న వ్యాపారులను ఖాళీ చేయించారు. మార్కెట్‌‌‌‌ పూర్తయ్యే వరకు వెజ్‌‌‌‌, నాన్‌‌‌‌వెజ్ మార్కెట్‌‌‌‌కు షిప్ట్‌‌‌‌ కావాలని సూచించారు. కానీ, అది దూరం అవుతుండడంతో అక్కడే  అడ్డెస్ట్‌‌‌‌ అయ్యారు. 

అలాగే ఎన్‌‌‌‌జీ కాలేజీ సమీపంలో పండ్లు అమ్ముకునేందుకు  స్టాల్స్‌‌‌‌ నిర్మించినా ప్రస్తుతం ఖాళీగా ఉంటున్నాయి. 35 మంది పండ్ల వ్యాపారులు ఉండగా,  25 స్టాల్స్​ మాత్రమే ఏర్పాటు చేయడంతో  వ్యాపారుల మధ్య తేడా వచ్చింది. దీంతో ఫైర్​స్టేషన్​సమీపంలో మరో 10 స్టాల్స్​ నిర్మించాలని ప్రతిపాదించినా.. ఎన్నికల వల్ల సాధ్యం కాలేదు. దీంతో వాళ్లు రోడ్లపైనే పండ్లు అమ్ముకుంటున్నారు. ఇదిలా ఉండగా వ్యవసాయ మార్కెట్‌‌‌‌ ఆవరణలో నిర్మించిన వెజ్, నాన్​ వెజ్​ మార్కెట్‌‌‌‌కు సమీపంలో వాసవి కన్యకపరమేశ్వ రి టెంపుల్​ఉండడంతో స్థానికులు అభ్యంతరం తెలిపారు. దీంతో  మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి  మార్కెట్‌‌‌‌ను​వేరే చోటికి తరలిస్తామని హామీ ఇచ్చారు.  

ఐటీ పార్క్‌‌‌‌ కూడా ఖాళీయే..

 రూ.90 కోట్ల ఐటీ పార్కు నిర్మాణం పరిస్థితి కూడా మార్కెట్లలాగే ఉంది.  ఎన్నికల ముందు మాజీ ఐటీ మంత్రి కేటీఆర్​, మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్​ రెడ్డి అట్టహాసంగా ప్రారంభించారు.  విదేశాలకు చెందిన 11 కంపెనీలు ఇక్కడ బ్రాంచీలు ఓపెన్​ చేస్తాయని, దాదాపు 2 వేల మందికి  ఉద్యోగాలు లభిస్తాయని ప్రకటించారు. ఆ మేరకు సంబంధిత కంపెనీలతో ఒప్పందాలు జరిగాయని వెల్లడించారు. కానీ  నాలుగైదు కంపెనీలు మాత్రమే ముందుకు రాగా..   అందులో 40,50 మంది మాత్రమే పనిచేస్తున్నట్టు తెలిసింది.

ప్రారంభించిన రెండు రోజులకే తాళం

దేవరకొండ రోడ్డులో కొత్తగా కట్టిన రైతుబజార్‌‌‌‌‌‌‌‌లో నాకు 7 నంబర్​మడిగ ఇచ్చిన్రు.  కొందరికి వెనక వైపు, కొందరికి ముందు వైపు ఇవ్వడంతో గిరాకీ రాలేదు. దీంతో మార్కెట్ ప్రారంభించిన రెండు రోజులకే అందరూ బయటికొచ్చేసిన్రు. ప్రస్తుతం అధికారులు మార్కెట్‌‌‌‌కు తాళం వేసిన్రు.

 కొండేటి వెంకటమ్మ   

రోడ్డుపైనే పండ్లు అమ్ముతున్న

 ఫ్రూట్ వ్యాపారుల కోసం మున్సిపాలిటీ అధికారులు డబ్బాలను ఏర్పాటు చేశారు.  స్టాల్స్​ ప్రారంభానికి కేటీఆర్ వస్తుండని అందరికీ డబ్బాలు కేటాయించి  ఇచ్చారు. డబ్బాలకు కిరాయి నిర్ణయించడంతో పాటు ఏవో సాకులు చెప్పి మళ్లీ ఇవ్వలేదు.  మరుసటి రోజు నుంచి మళ్లీ రోడ్డుపైనే పండ్లను అమ్మాల్సి వస్తుంది. 

 బైరోజు వెంకటమ్మ