- సెన్సెక్స్ 1,017 పాయింట్లు డౌన్
- 2 వారాల కనిష్ట స్థాయికి పతనం
- 1.17 శాతం క్షీణించిన నిఫ్టీ
ముంబై : ఈక్విటీ మార్కెట్లు వరుసగా నాలుగో సెషన్లోనూ నష్టపోయాయి. బెంచ్‌మార్క్ ఇండెక్స్ సెన్సెక్స్ శుక్రవారం 1,017 పాయింట్లు పడిపోయి రెండు వారాల కనిష్టానికి పతనమయింది. బలహీనమైన ప్రపంచ పోకడలు, విదేశీ నిధుల ప్రవాహాల కారణంగా చమురు, గ్యాస్, పీఎస్‌యూ బ్యాంక్ షేర్లు అమ్మకాల ఒత్తిడికి గురయ్యాయి. దీంతో 30 షేర్ల బీఎస్‌ఈ సెన్సెక్స్ 1,017.23 పాయింట్లు (1.24 శాతం) పతనమై 81,183.93 వద్ద స్థిరపడింది. ఇది ఆగస్టు 23 తర్వాత కనిష్ట ముగింపు స్థాయి. 24 సెన్సెక్స్ షేర్లు నష్టాల్లో ముగియగా, ఆరు లాభాల్లో ముగిశాయి.
ఇంట్రాడేలో ఇది 1,219.23 పాయింట్లు (1.48 శాతం) క్షీణించి 80,981.93 వద్దకు చేరుకుంది. ఎన్ఎస్ఈ నిఫ్టీ నిఫ్టీ 292.95 పాయింట్లు (1.17 శాతం) పడి 24,852.15 వద్ద ముగిసింది. వరుసగా మూడవ రోజూ తగ్గింది. దీంతో ఇన్వెస్టర్లు రూ. 5.49 లక్షల కోట్లు నష్టపోయారు. బీఎస్‌ఈ-లిస్టెడ్ సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 5,49,925.16 కోట్లు క్షీణించి రూ. 4,60,18,976.09 కోట్లకు చేరుకుంది. సెన్సెక్స్ కంపెనీలలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 4 శాతానికి పైగా పడిపోయింది.
ఎన్టీపీసీ, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, రిలయన్స్ ఇండస్ట్రీస్, యాక్సిస్ బ్యాంక్, ఐటీసీ నష్టాలను మూటగట్టుకున్నాయి. అయితే, బజాజ్ ఫైనాన్స్, ఏషియన్ పెయింట్స్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, మారుతీ షేర్లు లాభాల్లో ఉన్నాయి. ఎఫ్‌ఐఐల డిస్క్లోజర్ నిబంధనలపై సెబీ గడువు విధించిన కారణంగా దేశీయ మార్కెట్ తీవ్ర భయాందోళనలకు గురైందని, అయితే ఇది దీర్ఘకాలంలో ఎఫ్‌ఐఐలపై పెద్దగా ప్రభావం ఏమీ చూపదని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్, అన్నారు. గ్లోబల్ మార్కెట్లు కూడా యూఎస్ వ్యవసాయేతర పేరోల్ డేటాను విడుదల చేయడానికి ముందు జాగ్రత్త వైఖరిని అవలంబిస్తున్నాయని వివరించారు.
అన్ని సూచీలు నష్టాల్లోనే
బీఎస్‌ఈ మిడ్‌క్యాప్ గేజ్ 1.41 శాతం, బీఎస్‌ఈ స్మాల్‌క్యాప్ ఇండెక్స్ 0.96 శాతం క్షీణించింది. అన్ని సూచీలు ప్రతికూలంగా ముగిశాయి. టెలికమ్యూనికేషన్ 3.23 శాతం, ఆయిల్ అండ్ గ్యాస్ 2.19 శాతం, బ్యాంకెక్స్ 1.93 శాతం, క్యాపిటల్ గూడ్స్ 1.70 శాతం, సేవలు 1.58 శాతం పడిపోయాయి. బీఎస్‌ఈలో మొత్తం 2,541 స్టాక్‌లు క్షీణించగా, 1,406 లాభాల్లో ముగిశాయి. ఈవారంలో సెన్సెక్స్ 1,181.84 పాయింట్లు, నిఫ్టీ 383.75 పాయింట్లు క్షీణించింది. ఆసియా మార్కెట్లలో, సియోల్, టోక్యో, షాంఘై, హాంకాంగ్ నష్టాలతో ముగిశాయి. యూరోపియన్ మార్కెట్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.
గురువారం అమెరికా మార్కెట్లు చాలా వరకు నెగెటివ్‌లో ముగిశాయి. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (ఎఫ్‌ఐఐలు) గురువారం రూ. 688.69 కోట్ల విలువైన ఈక్విటీలను అమ్మారు. గ్లోబల్ ఆయిల్ బెంచ్‌మార్క్ బ్రెంట్ క్రూడ్ బ్యారెల్‌కు 0.14 శాతం పెరిగి 72.79 డాలర్లకు చేరుకుంది. శుక్రవారం రాత్రి ప్రచురించే యూఎస్ ఉద్యోగాల డేటా మార్కెట్‌లో సమీప-కాల ధోరణిని ప్రభావితం చేస్తుందని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటజిస్ట్ విజయకుమార్ అన్నారు.