విశ్లేషణ : బట్టీ చదువులతో ఫాయిదా ఉండదు

విశ్లేషణ : బట్టీ చదువులతో ఫాయిదా ఉండదు

నేటి విద్యార్థులు పరిసరాలతో మమేకమైన జ్ఞానానికి దూరమై మార్కుల మోజులో పడి బట్టీ చదువులను ఆశ్రయిస్తున్నారు. ప్రస్తుతం చాలా బడులు విద్యార్థులకు పోటీ ప్రపంచాన్ని అలవాటు చేయాలనే ఉద్దేశంతో వారిని తీవ్ర ఒత్తిడికి గురిచేస్తున్నాయి. దీంతో ఆశించిన మార్కులైతే వస్తున్నాయి కానీ.. ఆ మార్కులు విద్యార్థుల ఆలోచన విధానాన్ని మెరుగుపరచడం లేదు. విద్య వ్యక్తి వికాసం పెంచేలా ఉండాలి. బట్టి చదువు వల్ల బుద్ధి వికసించదు. ఫలితంగా పరిస్థితులకు తగ్గట్టు నేర్పు చూపించే సామర్థ్యం ఈ తరం పిల్లల్లో పెంపొందడం లేదు. మార్కులతో సంబంధం లేని ఇలాంటి నైపుణ్యాలను నేర్పే తీరికా, అవసరమూ ప్రస్తుత బడులకు ఉండటం లేదు. మార్కులు వస్తున్నాయా లేదా అన్నదే వారికి గీటురాయి. కానీ ఈ పరిస్థితి మారాలె.

స్వేచ్ఛ లేని చదువు
ఇప్పటికీ అనేక విషయాల్లో బ్రిటీష్ విధానాలనే అవలంబిస్తున్నాం. గుమస్తా గిరికి అవసరం వచ్చే చదువే నేర్చుకుంటున్నాం. రోజువారి జీవనానికి దూరంగా, మామూలు జీవితానికి సంబంధం లేని పాఠాలు వింటున్న పిల్లలు బయటికి వచ్చాక తరగతి గదిలో నేర్చుకున్నది నిజజీవితంలో ఎక్కడ ఉపయోగపడుతుందో తెలియక అయోమయానికి గురవుతున్నారు. భవిష్యత్​లో ఏమవ్వాలి అని ఆలోచించుకొనే స్వేచ్ఛ పిల్లలకు తల్లిదండ్రులు ఇవ్వడం లేదు. పిల్లల శారీరక, మానసిక ఎదుగుదలను పరిగణనలోకి తీసుకోకుండా టెస్టులు, స్పెషల్​క్లాసుల పేరిట విషయజ్ఞానాన్ని పిల్లలపై రుద్దుతున్నారు. నేటి విద్యాసంస్థలు బట్టీ చదువులతో ర్యాంకులను, మార్కులను చూపెడుతూ సమాజాన్ని మెప్పించే సంస్కృతిని పెంచి పోషిస్తున్నాయి. ఏటా వందల సంఖ్యలో విద్యార్థులు మార్కుల టెన్షన్ తో, ఇంట్లో/కాలేజీలో ఒత్తిడితో మానసికంగా కుంగి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇలాంటి బలవంతపు చావులు ఆపాలంటే మార్పు రావాల్సింది విద్యార్థుల్లో మాత్రమే కాదు. సమాజంలో కూడా. ఎక్కువ మార్కులు రావాలని తమ బిడ్డలపై తీవ్ర ఒత్తిడి పెంచుతున్న తల్లిదండ్రుల ఆలోచన మారాలె. ధనార్జనే ధ్యేయంగా నడుస్తున్న విద్యా సంస్థలను కట్టడి చేయాలి. మార్కులతో విద్యార్థిని అంచనావేసే పరీక్షా విధానంలోమార్పు రావాలి. 
 

సరళం నుంచి క్లిష్టం వైపు
విద్యార్థులు పెరిగేకొద్దీ వాళ్లు నేర్చుకోవాల్సిన  విజ్ఞాన, నైపుణ్య విధానాలను కూడా విద్యావేత్తలు క్రోడీకరించారు. అంటే చిన్నప్పుడు సరళమైన అంశాలు, పెరిగే కొద్దీ క్లిష్టమైన విషయాలు నేర్చుకోవాలి. చదువు ముగిసే సమయానికి సంక్లిష్టమైన విషయాలను అర్థంచేసుకోవడమేగాక అంతకంటే సంక్లిష్టమైనవి రూపొందించాల్సిన బాధ్యత కూడా చేపట్టాలి. ఉదాహరణకు వేదకాలంలోనే పిల్లలు ఒక చదువుకునే విషయాన్ని 25 శాతం ఉపాధ్యాయుడి(తల్లిదండ్రులు కూడా కావచ్చు) ద్వారా, 25 శాతం ఇతర పిల్లలతో చర్చించడం ద్వారా, 25 శాతం సొంతంగా, చివరి 25 శాతం ఉత్తరోత్తర కాలంలో(లోతుగా ఆలోచించడం, అనుభవాలు, పరిశోధనల ద్వారా) నేర్చుకుంటారని ప్రమాణీకరించారు. ఇప్పుడు మొత్తం విషయాన్ని (100%) స్కూల్​లో టీచరు ద్వారానే నేర్పించే ప్రయత్నాలు చేస్తున్నారు. 
 

వివిధ పద్ధతుల్లో అభ్యసనం
ఆధునిక శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం పిల్లలు వివిధ పద్ధతుల్లో నేర్చుకుంటారు. కొంత మాటల ద్వారా, మరికొంత బొమ్మల(చిత్రాలు, గ్రాఫులు వీడియోలు)ద్వారా, కొంత సమాచారం ద్వారా, మరికొంత ఆలోచన ద్వారా, కొంత వెంటనే, మరికొంత నిదానంగా ఇలా వివిధ రకాలుగా అభ్యసనం కొనసాగుతుంది. కాబట్టి వాటన్నింటిని పరిగణనలోకి తీసుకొని విద్యను బోధించాల్సి ఉంటుంది. పిల్లల మానసిక పరిపక్వత ఆధారంగా విద్యనందించే సంస్కృతి ప్రతి పాఠశాలలో కొనసాగాలి.