
చందానగర్, వెలుగు : తమ్ముడి పెండ్లికి ఖర్చు పెట్టిన డబ్బులు ఇచ్చేయాలని అన్న గొడవ పెట్టుకుని దాడి చేయడంతో మనస్తాపంతో తమ్ముడు పాయిజన్ తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ సరిత తెలిపిన వివరాల ప్రకారం.. చందానగర్‌లోని తారానగర్ ప్రాంతానికి చెందిన శరత్ చారి(28) పెళ్లికి అతడి అన్న కృష్ణచారి ఖర్చును భరించాడు.
శరత్‌కు 2023 ఆగస్టు 26 వ తేదీన సనత్‌నగర్ ప్రాంతానికి చెందిన చందనశ్రీతో పెండ్లి జరిగింది. అయితే అన్న కృష్ణచారికి రెండు గోల్డ్ షాపులు ఉండగా ఒకదాన్ని శరత్ చూసుకునేవాడు.. ఇటీవల శరత్ అన్న షాపులో పని చేయడం మానేశాడు. ఖాళీగా ఉంటూ ఉద్యోగం కోసం వెతుకుతున్నాడు. దీంతో పెండ్లికి ఖర్చు చేసిన డబ్బులు ఇచ్చేయాలని కృష్ణచారి, వదిన ప్రమీల ఇటీవల శరత్ తో గొడవపడ్డారు.
దీంతో శరత్ తన భార్య బంగారు ఆభరణాలను సోదరుడికి ఇచ్చేశాడు. అయినా ఇంకా అయినా ఇంకా డబ్బులు ఇవ్వాలని అన్న గొడవ పడ్డాడు. దీంతో శరత్ తనకు జాబ్ దొరికే వరకు పుట్టింట్లో ఉండూ భార్య చందనశ్రీకి చెప్పి, జాబ్ వచ్చాక తీసుకెళ్తానని సనత్ నగర్‌లోని పుట్టింటికి పంపించాడు. అయితే బుధవారం శరత్ అన్న కృష్ణ తనకు రావాల్సిన డబ్బులు ఇవ్వాలంటూ ఇంటికి వెళ్లి గొడవ పెట్టుకొని, శరత్‌పై దాడి చేశాడు.
తన డబ్బులు ఇవ్వకపోతే చనిపో అంటూ అనడంతో శరత్ మనస్తాపానికి గురయ్యాడు. గురువారం చందన తన భర్త శరత్‌కు కాల్ చేయగా ఫోన్ స్విచ్ఛాఫ్ వచ్చింది. తన బంధువును శరత్ ఇంటికి వెళ్లి చూడమని చెప్పింది. వెళ్లి చూసే సరికి పాయిజన్ తాగి బెడ్రూంలో కింద పడి ఉండగా శరత్ భార్యకు, పోలీసులకు చెప్పారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియాకు తరలించి కేసు నమోదు చేశారు.