రాష్ట్ర ఎకానమీకి గ్రోత్ ఇంజిన్లుగా జీసీసీలు : మంత్రి శ్రీధర్బాబు

రాష్ట్ర ఎకానమీకి  గ్రోత్ ఇంజిన్లుగా జీసీసీలు : మంత్రి శ్రీధర్బాబు
  • గచ్చిబౌలిలో ‘మార్స్’ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ ప్రారంభం

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ ఆర్థిక రంగాన్ని పరుగులు పెట్టించేందుకు గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లను (జీసీసీ) కీలక గ్రోత్ ఇంజిన్లుగా తీర్చిదిద్దుతున్నట్లు మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు. కేవలం బ్యాక్ ఆఫీస్ పనులకే కాకుండా, రీసెర్చ్ అండ్ డెవలప్‌‌మెంట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా అనలిటిక్స్ రంగాల్లోనూ ఈ కేంద్రాలు కీలక పాత్ర పోషించేలా ప్రభుత్వం మార్గనిర్దేశం చేస్తోందన్నారు. ప్రపంచ ప్రఖ్యాత ‘మార్స్’ సంస్థ హైదరాబాద్ గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌‌లో ఏర్పాటు చేసిన నూతన జీసీసీని గురువారం ఆయన ప్రారంభించారు.

 ఈ సందర్భంగా మాట్లాడుతూ.. హైదరాబాద్‌‌ను నాలెడ్జ్ ఎకనామీ హబ్‌‌గా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం రూపొందించిన ‘తెలంగాణ రైజింగ్ 2047’ విజన్‌‌లో టెక్నాలజీ, పారిశ్రామికాభివృద్ధికి అత్యంత ప్రాధాన్యతనిచ్చినట్లు వెల్లడించారు. ఐటీ సేవల సంస్థ ‘జెన్‌‌పాక్ట్’ భాగస్వామ్యంతో 60 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ కేంద్రం ద్వారా ప్రారంభ దశలో 400 మందికి ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. 

రాబోయే రోజుల్లో ఈ సంఖ్యను వెయ్యికి పెంచనున్నట్లు కంపెనీ వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మార్స్ వ్యాపార కార్యకలాపాలకు ఈ కేంద్రం డిజిటల్ సామర్థ్యాలను అందించనుంది. కార్యక్రమంలో మార్స్ సీఎఫ్‌‌ఓ క్లాస్ ఆగార్డ్, జెన్‌‌పాక్ట్ ప్రతినిధి తరుణ్ చోప్రా తదితరులు పాల్గొన్నారు.