సెల్యూట్ : అమర సైనికుడి చెల్లికి అన్నలై పెళ్లి చేసిన సైన్యం

సెల్యూట్ : అమర సైనికుడి చెల్లికి అన్నలై పెళ్లి చేసిన సైన్యం

దేశ సరిహద్దుకు గస్తీ కాస్తూ ఆ సైనికుడు అమరుడయ్యాడు. ఐతే… తోటి సైనికులు ఆ కుటుంబానికి పెద్దదిక్కు అయ్యారు. అమర జవాన్ చెల్లెలికి అంతా కలిసి పెళ్లి చేశారు. ఆర్థికంగానూ ఆదుకున్నారు. ఈ సంఘటన బిహార్ లోని బదిలాడీలో జరిగింది.

ఆ అమర జవాన్ పేరు జ్యోతి ప్రకాశ్ నిరాలా. ఇండియన్ ఎయిర్ ఫోర్స్  లో గరుడ కమాండోగా పనిచేశారు. 2017 నవంబర్ లో జమ్ముకశ్మీర్ లోని బండిపొరాలో ఉగ్రవాదులతో పోరాడుతూ వీరమరణం పొందారు. బండిపొరా .. హాజిన్ ప్రాంతంలో దాక్కున్న ఆరుగురు ఉగ్రవాదుల కోసం సాహసోపేత ఆపరేషన్ నిర్వహించిన టీమ్ లో నిరాలా ఒకరు. ఈ ఎన్ కౌంటర్ లో ఐదుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టింది ఎయిర్ ఫోర్స్ బృందం. ఆరో ఉగ్రవాది జరిపిన కాల్పుల్లో నిరాలా ప్రాణం వదిలారు. 2018లో రాష్ట్రపతి జ్యోతి ప్రకాశ్ నిరాలాకు అశోకచక్రను కూడా ప్రకటించింది.

జ్యోతి ప్రకాశ్ నిరాలా చెల్లెలు చంద్రకళ పెళ్లి ఇటీవలే బిహార్ లో జరిగింది. ఈ పెళ్లివేడుకకు అమరవీరుడైన జ్యోతి ప్రకాశ్ నిరాలా సహచరులు హాజరయ్యారు. 100 మంది గరుడ కమాండోలు ఈ పెళ్లిని దగ్గరుండి జరిపించారు. ‘తోడబుట్టిన అన్న లేడు’ అనే వెలితిని తగ్గించేందుకు వంద మంది అన్నలై వచ్చారు. వారి కుటుంబ సంప్రదాయం ప్రకారం…. అన్నయ్య చేతిలో చెల్లెలు అడుగు వేసుకుంటా నడవాలి. అలా.. సైనికులు తమ చేతులపై ఆమెను నడిపించి ఘనంగా వివాహం జరిపించారు. వ్యక్తిగతంగా రూ.5లక్షలు సేకరించి ఆ కుటుంబానికి ఇచ్చారు.

దేశానికి తాను ఒక్క కొడుకును ఇస్తే.. ఇపుడు 100మంది కొడుకులు తమ కుటుంబంలో ఎనలేని సంతోషం నింపారంటూ జ్యోతి ప్రకాశ్ నిరాలా తండ్రి ఆనందంతో పొంగిపోయాడు. అనుకోని అతిథులు అన్నలై వచ్చేసరికి ఆ జవాన్ చెల్లెలు గుండెలనిండా సంతృప్తిచెందింది.