టీసీఎస్లో ఉద్యోగం అయితే ఏంటీ.. రాజీనామా చేస్తున్న మహిళా ఉద్యోగులు

టీసీఎస్లో ఉద్యోగం అయితే ఏంటీ.. రాజీనామా చేస్తున్న మహిళా ఉద్యోగులు


కరోనా పుణ్యమా అని ఇన్నాళ్లు ఇంట్లో కూర్చుని హాయిగా పని చేసుకున్నారు.. ఏకంగా మూడు  సంవత్సరాలు.. ఆఫీసులో అడుగు పెట్టకుండా.. ఇంట్లో నుంచే పనులు చేశారు.. ఇప్పుడు మాత్రం కచ్చితంగా ఆఫీసుకు వచ్చి పని చేయాలని ఆదేశాలు రావటంతో.. జీర్ణించుకోలేకపోతున్నారు ఐటీ ఉద్యోగులు.  మేం ఆఫీసులకు రాం అంటూ మారాం చేస్తున్నారు. ససేమిరా అంటున్నాయి ఐటీ కంపెనీలు. ముఖ్యంగా టీసీఎస్ కంపెనీ అయితే విధిగా ఆఫీసుకు రావాల్సిందే అని ఆదేశాలు ఇచ్చింది.

టీసీఎస్ యాజమాన్యం నిర్ణయంతో మహిళా ఐటీ ఉద్యోగులు రివర్స్ షాక్ ఇస్తున్నారు. ఆఫీసుకు రాలేం.. మేం రాజీనామా చేస్తున్నాం అంటూ రిజైన్ లెటర్లు పంపిస్తున్నారంట. గతంలో రాజీనామా చేసి వెళ్లిపోయే మహిళా ఉద్యోగుల సంఖ్య తక్కువగా ఉండేదని, తాజాగా ఈ సంఖ్య పెరిగిపోయిందని టీసీఎస్ వర్గాలు వెల్లడించాయి. 

దీనికి కారణాలు ఏమైనా ఉన్నప్పటికీ ప్రధానమైన కారణం  వర్క్ ఫ్రం హోం ఎత్తివేయడమేనని తెలుస్తోంది.   కరోనా టైమ్ లో అమలు చేసిన వర్క్ ఫ్రం హోం సౌకర్యంతో కాస్త వెసులుబాటు దొరుకుతోందని, మళ్లీ ఆఫీసులకు రమ్మనడంతో ఆ వెసులుబాటును వదులుకోలేక మహిళా ఉద్యోగులు రిజైన్  చేయాడానికి సిద్ధపడుతున్నారట.  

టీసీఎస్ లో 6 లక్షల మందికి పైగా పని చేస్తున్నారు అందులో 35% మంది మహిళలున్నారు.  నాలుగింట మూడొంతుల మంది మహిళలు టాప్ పొజిషన్లలో ఉన్నారు.  అయితే ప్రస్తుతం 20% కంటే ఎక్కువ మంది మహిళా ఉద్యోగులను టీసీఎస్ కోల్పోయింది.  కరోనా ముందు వరకు సంస్థలోని మహిళా ఉద్యోగులు రాజీనామా చేసేందుకు ఇష్టపడేవారు కాదని, ఇటీవల మాత్రం ఒకరి తర్వాత మరొకరు అన్నట్లుగా రాజీనామాలు చేస్తున్నారని కంపెనీ హెచ్ ఆర్ విభాగానికి చెందిన ఉద్యోగులు చెబుతున్నారు.

కరోనా సెకండ్ వేవ్ తరువాత చాలా సాప్ట్ వేర్ కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ అప్షన్ ఎత్తివేస్తున్నాయి. ఆఫీసులకు రావాల్సిందేనని ఆదేశాలు జారీ చేస్తున్నాయ్.  ఈ నిర్ణయంపై ఉద్యోగుల నుంచి వ్యతిరేకత మొదలైంది. ఆఫీసుకు వచ్చేది లేదని, అవసరమైతే ఉద్యోగమే వదులుకుంటామని తేల్చిచెప్పారు. అవసరమైతే  వర్క్ ఫ్రమ్ హోమ్ అప్షన్ ఉన్న  ఆఫీసులకు షిప్ట్ అవుతున్నారు.  తాజాగా ఈ సెగ టీసీఎస్ కు కూడా తగిలింది.