రాష్ట్ర వ్యాప్తంగా సామూహిక జాతీయ గీతాలాపన

 రాష్ట్ర వ్యాప్తంగా సామూహిక జాతీయ గీతాలాపన

స్వతంత్ర భారత వజ్రోత్సవాలను పురస్కరించుకొని చేపట్టిన సామూహిక గీతాలాపన రాష్ట్ర వ్యాప్తంగా సాగింది. అందులో భాగంగా ఆబిడ్స్ లో ఏర్పాటు చేసిన సామూహిక జాతీయ గీతాలాపనలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. అందరితో కలిసి జాతీయ గీతాన్ని ఆలపించారు. ఇదే తరహాలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ సామూహిక గీతాలాపన జరిగింది. హైదరాబాద్ లోని పలు ప్రధాన ప్రాంతాల్లోనూ విద్యార్థులు రోడ్లపైకి వచ్చి ఈ గీతాలాపన చేశారు.

జిల్లాల్లోనూ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం జరిగింది. ఈ క్రమంలోనే అన్ని ట్రాఫిక్ సిగ్నల్లోనూ ఒక నిమిషం పాటు రెడ్ సిగ్నల్ వేసి జాతీయ గీతాలాపన చేశారు. హైదరాబాద్ మెట్రోలో ప్రయాణిస్తున్న ప్రయాణికులు సైతం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎక్కడ నిల్చున్న వారు అక్కడే నిల్చొని సామూహికంగా జనగణమన ఆలపించారు. కాగా స్వాతంత్ర్య దినోత్సవ ఉత్సవాల్లో భాగంగా ఉదయం 11.30 గంటలకు అందరూ ఎక్కడి వారు అక్కడే జాతీయ గీతాలాపన చేయాలని సర్క్యులర్ జారీ చేసిన విషయం తెలిసిందే.