ఆంధ్ర-ఒడిషా బార్డర్‎లో భారీ ఎన్ కౌంటర్.. మావోయిస్టు కీలక నేత జగన్‌ మృతి

ఆంధ్ర-ఒడిషా బార్డర్‎లో భారీ ఎన్ కౌంటర్.. మావోయిస్టు కీలక నేత జగన్‌ మృతి

అమరావతి: మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా తెలంగాణ-ఛత్తీస్ గఢ్‎ సరిహద్దులోని కర్రెగుట్టల్లో ఆపరేషన్ కగార్ ముమ్మరంగా కొనసాగుతుండగానే.. తాజాగా అల్లూరి జిల్లాలోని ఆంధ్ర-ఒడిషా బార్డర్‎లో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. పోలీసులు, మావోయిస్టుల మధ్య భీకర ఎదురుకాల్పులు జరిగాయి. పోలీసుల కాల్పుల్లో నలుగురు నక్సలైట్లు మృతి చెందారు. ఎన్ కౌంటర్లో మావోయిస్టు కీలక నేత జగన్‌ అలియాస్‌ పండన్న మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. 

కాగా, ఏవోబీలో మావోయిస్టులు సంచారిస్తున్నారన్న ఇంటలిజెన్స్ సమాచారంతో పోలీసులు కూంబింగ్ చేపట్టారు. ఈ క్రమంలో మావోయిస్టులు, పోలీసులు తారాసపడగా.. ఇరు వర్గాల మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయని అధికారులు వెల్లడించారు. పోలీసులు కాల్పుల్లో నలుగురు మావోలు మృతి చెందినట్లు తెలిపారు. మృతుల్లో మావోయిస్టు కీలక నేత జగన్‌ అలియాస్‌ పండన్న ఉన్నట్లు అధికారులు నిర్ధారించారు. జగన్‌పై తలపై రూ.20 లక్షల రివార్డ్ ఉన్నట్లు తెలిపారు.

►ALSO READ | దేశభద్రతపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే కేసు పెట్టాల్సిందే: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

ఎన్ కౌంటర్లో మరణించిన మరో ఇద్దరు మావోయిస్టులను సంకు నాచికా, రమేష్‌ గా గుర్తించారు. మరో మావోయిస్టు వివరాలు తెలియాల్సి ఉంది. ఘటన స్థలంలో భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. జీకే వీధి ఏజెన్సీలో కూంబింగ్ కొనసాగుతోందని పేర్కొన్నారు. ఓ పక్కా కర్రెగుట్టల్లో ఆపరేషన్ కగార్ ముమ్మరంగా సాగుతుండగా.. తాజాగా ఏవోబీలోనూ మావోయిస్టులకు ఎదురు దెబ్బ తగిలింది.