మహారాష్ట్రలో భారీ అగ్ని ప్రమాదం.. ఊపిరాడక ఏడుగురు మృతి

మహారాష్ట్రలో భారీ అగ్ని ప్రమాదం.. ఊపిరాడక ఏడుగురు మృతి

మహారాష్ట్రలో విషాద సంఘటన చోటుచేసుకుంది.  ఛత్రపతి శంభాజీ నగర్‌( ఔరంగాబాద్‌గా)లోని కంటోన్మెంట్ ప్రాంతంలో జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. ఏప్రిల్ 3వ తేదీ బుధవారం తెల్లవారుజామున ఓ బట్టల దుకాణంలో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఊపిరాడక ముగ్గురు మహిళలు, ఇద్దరు పురుషులు, ఇద్దరు పిల్లలతో సహా ఏడుగురు మృతి చెందారు. సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది హుటాహుటినా సంగటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఫైర్ ఇంజన్ తో మంటలను అదుపు చేశారు.
 
ఈ సంఘటనపై శంభాజీ నగర్ పోలీస్ కమీషనర్ మనోజ్ లోహియా మాట్లాడుతూ.. "ఉదయం 4 గంటల సమయంలో, ఛత్రపతి శంభాజీ నగర్‌లోని కంటోన్మెంట్ ప్రాంతంలోని ఒక బట్టల దుకాణంలో మంటలు చెలరేగాయి. మంటలు రెండవ అంతస్తుకు వ్యాపించలేదు.. కానీ తరువాత ప్రాథమిక విచారణలో ఊపిరాడక ఏడుగురు చనిపోయారని తేలింది. ఈ అగ్నిప్రమాదానికి గల కారణం ఇంకా స్పష్టంగా తెలియరాలేదు.ఈ ఘటనలో విచారణ జరుగుతోంది" అని తెలిపారు.