షాద్ నగర్, వెలుగు: విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో స్కాన్ ఎనర్జీ ఐరన్ పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. షాద్‌నగర్ రూరల్ సీఐ వెంకట్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. కొందుర్గు మండల కేంద్రానికి సమీపంలో ఉన్న ఐరన్ పరిశ్రమలో సోమవారం మధ్యాహ్నం విద్యుత్ షార్ట్ సర్య్యూట్ కావడంతో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.
ఈ ఘటనలో బిహార్ కు చెందిన కమల్ కిశోర్ (30), అనిల్ (30), మహాదేవ్ యాదవ్ (35) అనే ముగ్గురు కార్మికులు గాయపడ్డారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో మొత్తం 15 మంది కూలీలు ఉన్నారు. వారు వెంటనే బయటకు పరుగులు తీశారని ముగ్గురు అక్కడే చిక్కుకోవడంతో కమల్ కిశోర్ అనే కార్మికుడికి తీవ్ర గాయాలయ్యాయన్నారు. అనిల్, మహాదేవ్‌యాదవ్ అనే కార్మికులకు స్వల్ప గాయాలయ్యాయని పేర్కొన్నారు. ఈ ముగ్గురు కార్మికులను ప్రైవేటు ఆసుపత్రికి తరలించామన్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
