గొర్రెల స్కీమ్‌లో భారీ మోసం

గొర్రెల స్కీమ్‌లో భారీ మోసం
  • గొర్రెల స్కీమ్‌లో భారీ మోసం
  • సబ్సిడీ కింద ఒక్కో వ్యక్తి నుంచి రూ.31,250 వసూలు
  • రాష్ట్ర వ్యాప్తంగా రూ.8 కోట్ల కుంభకోణం
  • ముగ్గురిని అరెస్ట్‌ చేసిన ఘట్‌కేసర్ పోలీసులు

హైదరాబాద్‌‌, వెలుగు: గొర్రెల స్కీమ్‌‌తో భారీ స్కామ్‌‌ చేసిన ముగ్గురు సభ్యుల ముఠా గుట్టురట్టయింది. ప్రభుత్వం అందిస్తున్న స్కీమ్‌‌లో డిపాజిట్‌‌ పేరుతో రూ.8 కోట్లు వసూలు చేసిన  నిందితులను ఘట్‌‌కేసర్‌‌‌‌ పోలీసులు శుక్రవారం అరెస్ట్  చేశారు. కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌‌కి తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌‌కు చెందిన సజ్జ శ్రీనివాస రావు(38) ఘట్‌‌కేసర్ మండలం కొర్రెముల గ్రామంలో జూనియర్ వెటర్నరీ ఆఫీసర్‌‌‌‌గా పనిచేసేవాడు. గొల్ల కురుమలకు,  ఎస్సీ,  ఎస్టీ,  బీసీలకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న స్కీమ్స్‌‌ను టార్గెట్‌‌ చేశాడు.

భార్య  లక్ష్మి (34), బావ అనిల్‌‌కుమార్‌‌‌‌ సహా మరో వ్యక్తి కొల్లి అరవింద్‌‌ కుమార్‌‌ (45)తో కలిసి గొర్రెల పథకంలో మోసం చేసేందుకు ప్లాన్ చేశారు. మేడ్చల్‌‌,  నిజామాబాద్‌‌,  వరంగల్‌‌,  యాదాద్రి భువనగిరి సహా రాష్ట్ర వ్యాప్తంగా లబ్దిదారులను గుర్తించారు. రూ.1.25 లక్షల్లో 75 శాతం సబ్సిడీ అని నమ్మించారు. 20 గొర్రెల యూనిట్‌‌ కోసం రూ.1.25 లక్షలు లోన్‌‌ వస్తుందని ప్రచారం చేశారు. స్కీమ్‌‌లో 25 శాతం అంటే రూ.31,250 డిపాజిట్‌‌ చేస్తే మిగతా మొత్తం అంటే 75 శాతం ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుందని చెప్పారు. అర్హులైన లబ్ధిదారులకు గొర్రెలు, పశువులను పొందిన తర్వాత వాటిని ఓపెన్ మార్కెట్‌‌లో అధిక ధరకు అమ్ముకోవచ్చని ఆశ చూపారు.

ఒక్కో వ్యక్తి నుంచి రూ.31,250 వసూలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం రూ.8 కోట్లు వసూలు చేశారు. ఈ క్రమంలో 8 నెలల కింద శ్రీనివాసరావు  ఉద్యోగాన్ని వదిలేశాడు. భార్య లక్ష్మితో కలిసి హైదరాబాద్ విడిచి పారిపోయాడు. బాధితుల ఫిర్యాదుతో ఘట్‌‌కేసర్ పోలీసులు కేసు నమోదు చేశారు. శ్రీనివాస రావు, లక్ష్మి, అరవింద్‌‌కుమార్‌‌‌‌ను శుక్రవారం అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న శ్రీనివాస రావు బావ అనిల్‌‌ కుమార్‌‌ కోసం గాలిస్తున్నారు.