
- ఆది శ్రీనివాస్, ఆర్.కృష్ణయ్య, కూనంనేని తదితరుల దాఖలు
హైదరాబాద్, వెలుగు: బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతూ ఇచ్చిన జీవో నం:9ను అమలు చేయాలంటూ హైకోర్టులో పెద్ద సంఖ్యలో ఇంప్లీడ్ పిటిషన్లు దాఖలయ్యాయి. మంగళవారం ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, బీజేపీకి చెందిన ఎంపీ, బీసీ సంఘం జాతీయ నాయకుడు ఆర్.కృష్ణయ్య, సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు వేర్వేరుగా ఇంప్లీడ్ పిటిషన్లు వేశారు. ఇప్పటికే కాంగ్రెస్ నేత వి.హనుమంతరావు ఇతరులు దాఖలు చేయగా, మంగళవారం కాంగ్రెస్ నేతలు చరణ్ కౌశిక్ యాదవ్, ఇందిరా శోభన్ తదితరులు కూడా ఇంప్లీడ్ పిటిషన్లు వేశారు. వీరి తరఫున సీనియర్ అడ్వకేట్లు బీఎస్ ప్రసాద్, కేజీ కృష్ణమూర్తి ఇతరులు వాదించనున్నారు. సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూద్రా కూడా వాదనలు వినిపించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ఇందిరా సహానీ కేసులో సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం విద్య, ఉపాధి రంగాల్లో మాత్రమే మొత్తం రిజర్వేషన్లు 50 శాతానికి మించరాదని, స్థానిక పరిపాలనల్లో రిజర్వేషన్లకు ఆ తీర్పు వర్తించదని ప్రభుత్వం చెప్తున్నది. ఇప్పటికే నేరుగా సీఎం రేవంత్‌రెడ్డి మంత్రులు, న్యాయ నిపుణులతో మంతనాలు జరిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతూ ప్రభుత్వం జీవో 9ను కొట్టేయాలని కోరుతూ, హైదరాబాద్ రామాంతపూర్‌కు చెందిన విద్యార్థి శ్రీరామ శ్రీలేఖ మంగళవారం పిల్ దాఖలు చేశారు. జీవో 9ను సవాలు చేస్తూ బుట్టెంగారి మాధవరెడ్డి, సముద్రాల రమేశ్ దాఖలు చేసిన పిటిషన్ల తరఫున సీనియర్ న్యాయవాదులు జె.ప్రభాకర్, బి.మయూర్ రెడ్డి, కేవీ రెడ్డి తదితరులు వాదనలు వినిపించనున్నారు.