భారీగా  పెరిగిన ఈ‑టూవీలర్ల అమ్మకాలు

భారీగా  పెరిగిన ఈ‑టూవీలర్ల అమ్మకాలు

న్యూఢిల్లీ:  ఎలక్ట్రిక్ టూవీలర్ల అమ్మకాలు పుంజుకుంటున్నాయి. ఏటా వీటికి డిమాండ్​ పెరుగుతూనే ఉంది. ఎలక్ట్రిక్ టూవీలర్ల అమ్మకాలు అంతకుముందు ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2022–-23లో రెండున్నర రెట్లు పెరిగి 8,46,976 యూనిట్లకు చేరుకున్నాయి. సొసైటీ ఆఫ్​ మాన్యుఫాక్చరర్స్​ ఆఫ్​ ఎలక్ట్రిక్ వెహికల్స్ (ఎస్​ఎంఈవీ)  డేటా ప్రకారం..  2021–-22లో మొత్తం 3,27,900 ఈ–-టూ-వీలర్లు అమ్ముడయ్యాయి.  2023 ఆర్థిక సంవత్సరంలో 25 కిలోమీటర్ల తక్కువ వేగంతో వెళ్లే లోస్పీడ్​ ఈ-–-స్కూటర్లు1.2 లక్షల యూనిట్లు సేల్​ అయ్యాయి.  గంటకు 25 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో వెళ్లే ఈ–స్కూటర్లు 7,26,976 యూనిట్లు అమ్ముడయ్యాయి. 2021–-22లో లో స్పీడ్ ఈ-–స్కూటర్ల అమ్మకాలు 75,457 యూనిట్లుగా ఉండగా, హై స్పీడ్ ఈ-–స్కూటర్లు 2,52,443  సేల్​ అయ్యాయి. అయితే కిందటి ఆర్థిక సంవత్సరం అమ్మకాలు నీతి ఆయోగ్ సూచించిన టార్గెట్​ కంటే 25 శాతం కంటే తక్కువగా ఉన్నాయి. ఈవీల అమ్మకాలను పెంచడానికి ప్రభుత్వం ఫేమ్​ స్కీమును చాలా ఏళ్ల క్రితమే మొదలుపెట్టింది.

 ఈ పథకం మార్గదర్శకాలను కంపెనీలు పాటించడం లేదంటూ రాయితీలను నిలిపివేసింది. దీంతో అమ్మకాలు తగ్గాయని సొసైటీ తెలిపింది. లోకల్​గా పార్టులను తయారు చేయడం లేదంటూ ఇలా చేసిందని విమర్శించింది.   కంపెనీలు ఇప్పటికే వినియోగదారులకు  రూ. 1,200 కోట్ల కంటే ఎక్కువ సబ్సిడీని అందించారని, ఈ డబ్బును ప్రభుత్వం వారికి చెల్లించడం ఆపేసిందని పేర్కొంది.  కొన్ని కంపెనీలు ‘అండర్​ ఇన్​వాయిసింగ్​’ చేశాయనే ఆరోపణల కారణంగా  వాటికి రావాల్సిన రూ. 400 కోట్ల విలువైన ఇన్సెంటివ్స్​ను నిలిపివేశారు.   "ఈవీ పరిశ్రమలో 95 శాతానికి పైగా ప్రాతినిధ్యం వహిస్తున్న 16 కంపెనీలు గందరగోళంలో ఉన్నాయి. సమస్యల పరిష్కారం  కోసం ఎదురుచూస్తున్నాయి . ఫేమ్​ పీఎంపీ ఇబ్బందులు తొలుగుతాయని భావిస్తున్నాయి. లేకపోతే చాలా సమస్యలు వస్తాయి”అని అసోసియేషన్​ పేర్కొంది

టార్గెట్​ను చేరుకోలే...

ఈవీ అమ్మకాలపై ఎస్​ఎంఈవీ డైరెక్టర్ జనరల్ సోహిందర్ గిల్ మాట్లాడుతూ, "2023 ఆర్థిక సంవత్సరం నాటికి ఈవీల సంఖ్యను 30 శాతానికి పెంచాలని టార్గెట్​గా పెట్టుకున్నా ఇది 5 శాతం మించలేదు. 2030 నాటికి రోడ్లపై 80 శాతం బండ్లు కరెంటువే ఉండాలన్న టార్గెట్​ను చేరుకోవడం సాధ్యం కాకపోవచ్చు. ఇప్పటికీ మించిపోయింది ఏమీ లేదు. పీఎంపీ ఎలిజబిలిటీ క్రైటీరియాను రెండు సంవత్సరాలు పొడిగించాలి. ఈ ఏడాది ఏప్రిల్ నుండి వీటిని తు.చ. తప్పకుండా అమలు చేయాలి.  ఫేమ్​ పథకం కొనసాగింపుపై ప్రభుత్వ నిర్ణయం ఈవీ పరిశ్రమ భవిష్యత్​కు కీలకం.   కేంద్రం ఏదో ఒకటి చెప్పాలి”అని అన్నారు. ఈవీ ఎకోసిస్టమ్​ను అభివృద్ధి చేయడానికి, మరింత శక్తిమంతంగా మార్చడానికి మరో 3–-4 సంవత్సరాల పాటు ఫేమ్​ పథకాన్ని పొడగించాలని సొసైటీ పేర్కొంది. 

కంపెనీల మధ్య గందరగోళం కారణంగా అవి దీర్ఘకాలిక వ్యూహాన్ని అభివృద్ధి చేయలేకపోతున్నాయని విమర్శించింది.  సబ్సిడీలను తగ్గిస్తే ఈవీల మార్కెట్​ దెబ్బతింటుందని హెచ్చరించింది. ఈవీల బ్యాటరీలు,  మోటార్లు వంటి ముఖ్యమైన భాగాలను స్థానికంగా తయారు చేయడం వీలుకావడం లేదని, సప్లై చెయిన్​కు ఉన్న అతిపెద్ద సమస్యల్లో ఇదీ ఒకటని పేర్కొంది. ఇప్పటికే ఉన్న సబ్సిడీ విధానంలోని లోపాలను  ప్రభుత్వం వెంటనే సరిదిద్దాలని కూడా పిలుపునిచ్చింది.  ప్రభుత్వం సబ్సిడీ నేరుగా కస్టమర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఇస్తేనే అక్రమాలు తగ్గుతాయని తెలిపింది.