పల్లెలూ వచ్చేసినయ్ ఆన్​లైన్​లోకి

పల్లెలూ వచ్చేసినయ్ ఆన్​లైన్​లోకి

మనదేశంలో అతిపెద్ద ఆన్​లైన్​ బిజినెస్​ కంపెనీలైన ఫ్లిప్‌‌కార్ట్‌‌, అమెజాన్‌, స్నాప్​డీల్ ఈసారి ముందుగానే దసరా, దీపావళి పండగలు జరుపుకున్నాయని చెప్పొచ్చు. ఇది వరకు వీటికి నగరాలు, పట్టణాల నుంచే ఎక్కువ ఆర్డర్లు వచ్చేవి. ఈసారి గ్రామీణ ప్రాంతాలకు భారీ సంఖ్యలో డెలివరీలు ఇచ్చి ఆదాయాన్ని మరింత పెంచుకున్నాయి. పండగల సీజన్‌‌ సందర్భంగా ఈ ఆన్​లైన్​ బిజినెస్​ కంపెనీలు గత నెల 29 నుంచి ఈ నెల నాలుగు వరకు ఫెస్టివల్‌‌ సేల్స్‌‌ నిర్వహించాయి. ఇండియా స్టార్టప్‌‌ కంపెనీ ఫ్లిప్‌‌కార్ట్‌‌లో వాల్‌‌మార్ట్‌‌ 70 శాతానికిపైగా వాటా తీసుకున్న సంగతి తెలిసిందే. ఫెస్టివల్‌‌ సేల్స్‌‌ కోసం వేలాది ప్రొడక్టులపై ఇవి భారీ ఆఫర్లు ఇచ్చాయి. కొన్ని కార్డులతో కొంటే 10 శాతం డిస్కౌంట్‌‌ అందించాయి. ఈఐఎం, క్యాష్‌‌బ్యాక్‌‌లతోనూ కస్టమర్లను ఆకర్షించాయి.

గతంలో మాదిరి నగరాలపైనే కాకుండా ఈసారి చిన్న పట్టణాలపై, గ్రామాలపై బాగా దృష్టి సారించాయి. తాము 100 శాతం పిన్‌‌కోడ్‌‌లకు పార్సిల్స్‌‌ పంపించగలిగామని అమెజాన్‌‌ సీనియర్‌‌ ఆఫీసర్‌‌ అరుణ్‌‌ దేశ్‌‌ముఖ్‌‌ ‘వెలుగు’కు చెప్పారు. ముఖ్యంగా దుస్తులు, ఎలక్ట్రానిక్స్‌‌ విపరీతంగా అమ్ముడయ్యాయని, గ్రామీణ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ఆర్డర్లు వచ్చాయని వివరించారు. ఇందుకోసం అమెజాన్‌‌ ఫుల్‌‌ఫిల్‌‌మెంట్‌‌ సెంటర్ల సంఖ్యను పెంచినట్టు చెప్పారు. అమ్మకాల విలువను ఈ రెండు కంపెనీలూ బయటపెట్టకపోయినప్పటికీ, రికార్డుస్థాయి సేల్స్‌‌ సాధించినట్టు ప్రకటించాయి. ఈసారి దేశవ్యాప్తంగా 500 నగరాలకు చెందిన తమ 65 వేల మంది సెల్లర్స్‌‌ భారీగా ఆర్డర్లు సంపాదించగలిగారని అమెజాన్‌‌ ఇండియా చీఫ్‌‌ అమిత్‌‌ అగర్వాల్‌‌ వెల్లడించారు. ఇదిలా ఉంటే, ఈ సేల్స్​తో విపరీతంగా అమ్మకాలు జరగడంతో, మరోసారి ఫ్లిప్​కార్ట్​, అమెజాన్​ ఫెస్టివల్​ సేల్స్​ నిర్వహిస్తున్నాయి. ఈ నెల 12 నుంచి 16 వరకు దీపావళి సేల్​ చేపడతామని ఫ్లిప్​కార్ట్​ ప్రకటించింది. ఈ నెల 13 నుంచి 17 వరకు అమెజాన్​ బిగ్​ బిలియన్​ సేల్​ నిర్వహించనుంది. ఈసారి కూడా కొన్ని బ్యాంకుల కార్డులపై పదిశాతం తక్షణ డిస్కౌంట్​ ఇస్తామని, ఫెస్టివల్​ ఆఫర్లన్నీ కొనసాగిస్తామని ఈ రెండు కంపెనీలు తెలిపాయి.

ఈ ట్రెండ్​కు కారణాలు చౌక డేటా, ఆఫర్లు …

స్మార్ట్‌‌ఫోన్లు తక్కువ ధరలకే రావడం, చవకగా డేటా సేవలు అందడం వల్ల లక్షలాది మంది ఇండియన్లు ఆన్‌‌లైన్‌‌ బాట పట్టారు. అందుకే ఫ్లిప్‌‌కార్ట్‌‌, అమెజాన్‌‌లు గ్రామీణ ప్రాంతాలకు తమ డెలివరీ నెట్‌‌వర్క్‌‌ను మరింత విస్తరించాయి. డెలివరీ ఏజెంట్ల సంఖ్యను మరింతగా పెంచుకున్నాయి. పల్లెటూళ్ల కస్టమర్ల కొనుగోలు విలువ కూడా ఈసారి పెరిగిందని ఫారెస్టర్‌‌ రీసెర్చ్‌‌ ఇన్‌‌కార్పొరేషన్‌‌కు చెందిన సతీశ్‌‌ మీనా వివరించారు. ఆన్‌‌లైన్‌‌లో కొంటే భారీగా డిస్కౌంట్లు, ఆఫర్లు ఉంటాయని ఈ రెండు కంపెనీలు చేసిన ప్రచారం విజయవంతమైందని అన్నారు. వడ్డీ లేకుండా సులభవాయిదాల్లో వస్తువు కొనే విధానం వల్ల కూడా ఆర్డర్లు పెరిగాయని చెప్పారు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి కొత్త కస్టమర్ల సంఖ్య 50 శాతం పెరిగిందని ఫ్లిప్‌‌కార్ట్‌‌ తెలిపింది. చిన్న నగరాలు, పల్లెటూర్ల నుంచి వచ్చే ఆర్డర్ల సంఖ్య 100 శాతం పెరిగిందని వెల్లడించింది. తమ సెల్లర్లలో 40 శాతం మంది చిన్న పట్టణాల వాళ్లేనని వివరించింది. గ్రామీణ ప్రాంతాల నుంచి ఆదరణ పెరగడంపై ఫ్లిప్‌‌కార్ట్‌‌ సీఈఓ కల్యాణ్‌‌ కృష్ణమూర్తి స్పందిస్తూ భారత్‌‌ ఇండియాగా మారుతోందని అన్నారు. గ్రామాల నుంచి పెద్ద ఎత్తున కస్టమర్లను ఆకర్షించడంతోపాటు అక్కడి వ్యాపారులను, కళాకారులను కూడా ఆకర్షించగలిగామని అగర్వాల్‌‌ చెప్పారు. తాము తంజావూరు పెయింటింగ్స్‌‌, పోచంపల్లి చీరల వంటివి పెద్ద ఎత్తున అమ్మడమే ఇందుకు నిదర్శనమని వరుణ్‌‌ దేశ్‌‌ముఖ్‌‌ చెప్పారు.