రిజర్వేషన్ల కోసం మాజీ సీఎం ఇంటిపై దాడి

రిజర్వేషన్ల కోసం మాజీ సీఎం ఇంటిపై దాడి

కర్నాటకలో రిజర్వేషన్లపై ఉద్యమం విధ్వంసానికి దారి తీస్తుంది. శివమొగ్గలోని బీజేపీ మాజీ సీఎం.. కీలక నేత యడ్యూరప్ప ఇంటిని ముట్టడించారు బంజారా కమ్యూనిటీకి చెందిన వేలాది మంది ఆందోళనకారులు. మార్చి 27వ తేదీ సోమవారం ఉదయం నుంచి నిరసన వ్యక్తం చేస్తున్న ఆందోళనకారులు.. మధ్యాహ్నం తర్వాత ఒక్కసారిగా రెచ్చిపోయారు. యడ్యూరప్ప ఇంటిపై రాళ్లు రువ్వారు. నిరసనలు అదుపుతప్పటంతో లాఠీఛార్జి చేశారు  పోలీసులు. 

వివాదం ఎందుకు అంటే.. కర్నాటకలో షెడ్యూల్ కులాల్లోని ఉప కులాలకు రిజర్వేషన్లకు సంబంధించి జస్టిస్ ఏజే సదాశివ కమిషన్ తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. ఈ నివేదిక ప్రకారం షెడ్యూల్ కులాల్లోని ఉప కులాలకు.. జనాభా ప్రాతిపదికన.. దామాషా పద్దతిలో ప్రాతినిధ్యం కల్పించాలని సిఫార్సు చేసింది ఆ కమిటీ. ఆ నివేదికను అమలు చేయటానికి సిద్ధం అయ్యింది సీఎం బొమ్మై ప్రభుత్వం. సదాశివ కమిషన్ సిఫార్సులను అమలు చేసినట్లయితే.. బంజారాలకు అన్యాయం జరుగుతుందంటూ కొన్ని రోజులుగా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు బంజారాలు. ఇన్నాళ్లు శాంతియుతంగా సాగిన వీరి ఉద్యమం.. సోమవారం ఒక్కసారిగా ఉద్రిక్తతకు దారి తీసింది.

శివమొగ్గలోని యడ్యూరప్ప ఇంటిపై రాళ్ల దాడి చేయటంతో.. పోలీసులు లాఠీచార్జి చేయటంతో చాలా మంది గాయపడ్డారు. లాఠీచార్జిపై ఆగ్రహించిన ఆందోళనకారులు, సీఎం బసవరాజ్ బొమ్మై, యడ్యూరప్ప దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. సదాశివ కమిషన్ సిఫార్సులను అమలు చేయకూడదని.. స్వార్థ ప్రయోజనాలతోనే ఆ కమిషన్ నివేదిక తయారు చేసిందంటూ బంజారా కమ్యూనిటీకి చెందిన వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కర్నాటకలో త్వరలో ఎన్నికలు ఉండటంతో.. ఇది పొలిటికల్ వార్ గా మారింది. బంజారాలకు మిగతా పార్టీలు మద్దతు ప్రకటిస్తుండటంతో.. రాజకీయ రంగు పులుముకుంది. ప్రధాని మోడీ కర్నాటక పర్యటన ముగిసిన 24 గంటల్లోనే బంజారాలు ఆందోళనలు తీవ్రతరం చేయటం విశేషం.