హైదరాబాద్: లోక్‌భవన్ ముట్టడికి ఇండియా కూటమి నేతలు పిలుపునివ్వడంతో హైదరాబాద్‌లో పోలీసులు అప్రమత్తమయ్యారు. SIRలో అవకతవకలు జరిగాయంటూ ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ (CEC) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ లోక్‌భవన్ ముట్టడికి సిద్ధమయ్యారు.
ఈ క్రమంలో నెక్లెస్ రోడ్‌లోని ఇందిరాగాంధీ విగ్రహం నుంచి ‘చలో లోక్‌భవన్’ ర్యాలీ ప్రారంభం అయింది. కాంగ్రెస్, వామపక్షాలకు చెందిన నేతలు, కార్యకర్తలు భారీగా ర్యాలీగా లోక్‌భవన్ వైపు వెళ్లేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
లోక్‌భవన్ వద్ద భారీ భద్రత
ప్రతిపక్షాల ఆందోళన నేపథ్యంలో పోలీసులు లోక్‌భవన్ పరిసరాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. భారీగా పోలీసు బలగాలను మోహరించడంతో పాటు బారికేడ్లను ఏర్పాటు చేశారు. ర్యాలీ లోక్‌భవన్ వరకు చేరకుండా ముందస్తు చర్యలు చేపట్టారు.
ఖైరతాబాద్ సిగ్నల్ నుంచి లోక్‌భవన్ వెళ్లే మార్గంలో పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. లోక్‌భవన్‌కు వెళ్లే మార్గాల్లో ఇప్పటికే భారీగా పోలీసు బలగాలను మోహరించారు. కీలక ప్రాంతాల్లో నిఘా ఏర్పాటు చేసి పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.
ఆందోళనకారులను అదుపులోకి తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడితే వారిని తరలించేందుకు పోలీసులు వాహనాలను కూడా సిద్ధంగా ఉంచారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా, శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు.
లోక్‌భవన్ పరిసరాలను పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకోవడంతో నెక్లెస్ రోడ్, ఖైరతాబాద్, లోక్‌భవన్ మార్గాల్లో భద్రత మరింత కట్టుదిట్టం చేశారు. ర్యాలీ నేపథ్యంలో నగరంలో పరిస్థితిని పోలీసులు నిశితంగా పర్యవేక్షిస్తున్నారు.
